తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. తెలంగాణలో బీజేపీ – జనసేన పార్టీల పొత్తు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించుకున్నారు. అటు తెలంగాణలో పోటీ చేయాలని జనసేన కూడా రెడీగా ఉన్నట్లు ప్రకటించడంతో.. ఇక రెండు పార్టీల మధ్య పొత్తుపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరిన విషయం తెలిసిందే. జనసేన 30 స్థానాల్లో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పోటీ చేయడానికి సిద్ధమైంది. జనసేన పోటీ చేయకుండా బేషరతుగా మద్దతివ్వాలని బీజేపీ కోరుతోంది.
ఈ అంశంపై అమిత్ షాతో భేటీ మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేన ఏ విధమైన మద్దతు ఇస్తారనేది త్వరలో తేలిపోనుంది. కనీసం 32 స్థానాల్లో పోటీ చేయాలన్నది తెలంగాణ జనసేన ఆకాంక్ష. కాని, ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 20 స్థానాలు తమకు కేటాయించాలని ఆ పార్టీ బీజేపీని కోరుతోంది. ఈ మేరకు తమ ప్రతిపాదనను బీజేపీ పెద్దల ముందు బీజేపీ ఉంచినట్టు తెలుస్తోంది. నవంబర్ ఒకటిన జరిగే సిఈసి సమావేశం తర్వాత తెలంగాణకు సంబంధించి రెండో జాబితాను బీజేపీ విడదల చేయనుంది. అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను తాము కమిటీ ముందుంచుతామని, అందులో ఎన్ని పేర్లకు కమిటీ ఆమోదం తెలుపుతుందో చూడాలని కిషన్‌రెడ్డి తెలిపారు.