భారత అత్యున్నత న్యాయస్థానంలో ఇప్పటివరకు 71వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 10వేలకుపైగా కేసులు పదేళ్లకంటే ముందునుంచి నిరీక్షణలో ఉన్నాయని తెలిపింది. రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
‘ఆగస్టు 2 నాటికి సుప్రీంకోర్టులో 71,411 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 56,000 సివిల్ కేసులు కాగా మరో 15,000 కేసులు క్రిమినల్‌కు సంబంధించినవి. మొత్తం 71వేల కేసుల్లో దాదాపు 10వేల కేసులు పదేళ్లకు పైగా సుప్రీం కోర్టులోనే పెండింగ్‌లో ఉన్నాయి. మరో 42వేల కేసులు ఐదేళ్లకంటే తక్కువ సమయం కాగా.. 18,314 కేసులు మాత్రం ఐదు నుంచి పదేళ్ల మధ్య కాలంలో పెండింగ్‌లో ఉన్నాయి’ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
ఇక దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 2016నాటికి మొత్తం 40,28,591 కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఈ ఏడాది జులై 29నాటికి 59,55,907 కేసులకు పెరిగాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ వ్యవధిలోనే దాదాపు 50శాతం కేసులు పెరిగాయన్నారు.
జిల్లా, కిందిస్థాయి కోర్టుల్లోనూ పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోందని.. 2016 నుంచి ఈ ఏడాది వరకు కేసుల సంఖ్య 50శాతం పెరిగాయని చెప్పారు. ఇలా మొత్తంగా దేశంలో 2016లో 2.82 కోట్ల కేసులు పెండింగులో ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 4.24కోట్లకు చేరిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.