తెలంగాణలోని పొలీస్ విభాగంలో చాలా వరకు బదిలీలు, నియామకాలు పెండింగులోనే ఉన్నాయి. గతంలో దీపావళి వరకు పోలీసుల బదిలీలు, ఖాళీగా ఉన్న కీలక పోస్టుల్లో భర్తీలు అంటూ లీకులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు స్పందించకపోవడం విడ్దూరంగా ఉన్నది. బదిలీలు, నియామకాల్లో ఎదురుచూస్తున్న జాబితాలొ ఐపీఎస్‌లతో పాటు అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు సైతం ఉన్నారు.
హైదరాబాద్ కమిషనర్ (నేరాలు) విభాగం పోస్ట్ కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. సైబరాబాద్,రాచకొండ జాయింట్ కమిషనర్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా, హైదరాబాద్ షీ టీమ్స్, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ, రాచకొండ సైబర్ నేరాల డీసీపీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లు సమాచారం.నిజామాబాద్ కమిషనర్ కల్మేశ్వర్ సింగన్వార్, డిచ్‌పల్లి బెటాలియన్ కమాండర్ రోహిణి ప్రియదర్శిని కేంద్ర సర్వీస్‌లకు వెళ్లడంతో ఈ రెండు పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. గాంధీనగర్‌లో ఏసీపీ పోస్టు, చాలా చోట్ల డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా తెచ్చిన హైడ్రాకు కూడా ఏసీపీ పోస్ట్ ఖాళీగా ఉంది.సీఐడీ అదనపు డీజీగా ఉన్న శిఖాగోయల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మహిళా భద్రత విభాగం బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. ఈ మూడు కూడా కీలకవిభాగాలే కావడం గమనార్హం. ఖాళీగా ఉన్న పోస్టులు, ఇంచార్జీలుగా ఉన్న పోస్టులలో పూర్తి స్థాయి అధికారులను ఎప్పుడూ నియమిస్తారో అని అధికారులు ఎదురుచూస్తున్నారు.