ఆర్టీసీ కార్మికులకు నిజానికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జీతాలు అందుతున్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయినా వారు పలు కారణాలతో సమ్మె చేపట్టారు.
సీఎం కేసీఆర్.. ప్రత్యర్థులకు మింగుడు పడని పదార్థం.. ఆయన ఏదైనా అనుకున్నాడంటే అంతే.. ప్రపంచం తలకిందులైనా చేసి తీరుతారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలుకొని సీఎం అయ్యేదాకా ఆయన కృషి అనిర్వచనీయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి దేశంలోని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రజల కోసం అవసరమైతే ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధమనే ఆయన వ్యక్తిత్వం నిజానికి ప్రతిపక్ష పార్టీలకు కూడా విస్మయాన్ని కలిగిస్తుంటుంది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలనే ఆశయం ఆయనది. అలాంటిది ఆయన ఆర్‌టీసీ కార్మికుల పట్ల ఇప్పుడు ఎందుకంత కఠినంగా మారారు..?
ఆర్‌టీసీ కార్మికులకు నిజానికి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జీతాలు అందుతున్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయినా వారు పలు కారణాలతో సమ్మె చేపట్టారు. అయితే ఏ వర్గానికి చెందిన వారికైనా సరే.. సమస్య ఉందని చెబితే కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించడంలో ముందే ఉంటారు. కానీ ఆర్‌టీసీ కార్మికుల విషయంలో మాత్రం ఆయన అసహనంగా ఉన్నారు. అందుకు కారణాలూ లేకపోలేదు..
ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న ప్రధాన డిమాండ్లలో ఒకటి.. ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.. నిజానికి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్‌కు ఈ విషయం లెక్కకాదు. ఏపీలో ఆర్‌టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే కేసీఆర్ ఇక్కడ 44 శాతం ఇచ్చారు. అయితే ఎన్నికల హామీలో భాగంగా ఏపీ సీఎం జగన్ అక్కడ ఆర్‌టీసీ ప్రభుత్వంలో విలీనం చేశారు. కానీ ఇక్కడ తాము హామీ ఇవ్వలేదని, అందుకని విలీనం ప్రసక్తే లేదని కేసీఆర్ చెప్పారు. అయినా ఆర్‌టీసీ కార్మికులు సమ్మె బాట వీడలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కార్మికులు అడుగుతున్న ఆ డిమాండ్ తో వారికేమైనా లాభం కలుగుతుందా.. లేదా అనే…
ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందేమోగానీ.. సాధారణ జనాలకు ఒరిగేదేమీ ఉండదు. చార్జీలు తగ్గుతాయా..? పాసుల రూపంలో ఇచ్చే రాయితీలు తగ్గుతాయా..? అంటే అది సందేహమే. మరి వారి డిమాండ్‌కు ఇక అర్థం ఏముంటుంది ? అంటే.. వారు కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం కోసమే ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని అడుగుతున్నారని అనుకోవచ్చు. మరి కేసీఆర్ ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారా, ఉద్యోగులకా.. అంటే ప్రజలకే.. అని నిర్మొహమాటంగా ఎవరైనా చెబుతారు. ప్రజా ప్రయోజనాల కోసమే ఆయన నిరంతరం పనిచేస్తారు. కేవలం కొద్ది మంది కోసం కాదు. అందుకనే ఆర్‌టీసీ కార్మికులు కోరుతున్న గొంతెమ్మ కోర్కెలను కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. ఆయన ప్రజల మనిషి కనుకనే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆర్‌టీసీ కార్మికుల సమ్మెపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఇదేమీ తెలియని ప్రతిపక్షాలు గుడ్డిగా ఆయనను వ్యతిరేకిస్తున్నాయి. ఎంతైనా.. కేసీఆర్ కదా.. నిజంగా ఆయన ప్రతిపక్షాలకు మింగుడు పడని పదార్థమే.!