వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు పర్యటించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై ఆయణ్ను నిలదీశారు.
శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే అధికారంలోకి రాగానే.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు అవి అమలు చేయకుండా మోసం చేశారని పర్వతగిరి మండల ప్రజలు అన్నారు. హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బుద్ది చెప్తామంటూ ఎమ్మెల్యే నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలకు సర్దిచెప్పేందుకు ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే నాగరాజు మధ్యలోనే వెళ్లిపోయారు.