భారత్‌లో రోజు వారీగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండడం, కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి చెందేందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లే కారణమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన పీటీఐకి ఈ విషయంపై ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుందని సైంటిస్టులు ముందస్తుగా హెచ్చరించినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే కోవిడ్ ప్రభావం ఇంకా తగ్గకముందే కోవిడ్‌ను జయించామని ప్రధాని మోదీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మోదీ ఆ ప్రకటన చేసిన తరువాతే దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడం మొదలైందని అన్నారు.
కరోనా నుంచి స్వీయ రక్షణే ముఖ్యమని రాహుల్ అన్నారు. ఎవరూ వచ్చి సహాయం చేయరని, మోదీ అయితే అస్సలు సహాయం చేయరని విమర్శించారు. దేశంలో కరోనా పరిస్థితి అదుపు తప్పుతుంటే మోదీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో కోవిడ్ ఇంతలా వ్యాప్తి చెందేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లే కారణమన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుందని ముందే హెచ్చరించినా పట్టించుకోలేదని, ముందస్తుగా సిద్ధం అయి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంటే మోదీ, షా ల ద్వయం మాత్రం ఎన్నికల్లో నిమగ్నమయ్యారని అన్నారు. వారు కరోనా సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాలకు కారణమయ్యారన్నారు. ఇటీవల ఎన్నికల కార్యక్రమాల్లో ఆ ఇద్దరూ మాస్కులు ధరించకుండానే ప్రజల్లో తిరిగారని అన్నారు. అయితే అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని వారు చెబుతున్నారని, ఇది ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. కేవలం టీకాలను వేస్తేనే కరోనా అదుపులోకి వస్తుందని అన్నారు.