ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అమిస్తాన్ పూర్ శివారులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.
దేశంలో పండుగల సీజన్ మొదలైందని అన్నారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి పొందుతారని అన్నారు. తెలంగాణలో నేడు వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. తెలంగాణకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు. ఆదివాసీ దేవతలైన సమ్మక్క-సారక్క పేరిట ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, అందుకోసం రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.
అంతేకాకుండా పాలమూరు సభలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోడీ. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతమని ఆయన మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబసభ్యులే ఉంటారన్న మోడీ.. బీఆర్‌ఎస్ కారు స్టీరింగ్ మరో పార్టీ చేతిలో ఉందని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుందని, మోడీ ఇచ్చే గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు భరోసా ఉందని, తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు. రాజకీయ పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని మోడీ ధ్వజమెత్తారు.