తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైంది. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఇవాళ ఉదయం దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
‘ప్రారంభోత్సవానికి ముందు మోదీ మాట్లాడుతూ.. “‘పండగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ గొప్ప కానుక. తెలుగు ప్రజలకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రైలు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతుంది. హైదరాబాద్- వరంగల్ – విజయవాడ – విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుంది. సికింద్రాబాద్ – విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. పూర్తిగా దేశీయంగా తయారైన వందేభారత్‌తో బహుళ ప్రయోజనాలున్నాయి. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో పాటు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్ రైలు ఇది. మారుతున్న దేశ భవిష్యత్తుకు ఇదొక ఉదాహరణ.”’’ అని మోదీ పేర్కొన్నారు.