ఈ ఏడాది జీ-20 దేశాల సదస్సు నిర్వహణ, గ్రూప్ అధ్యక్ష బాధ్యతలు భారత్ కు దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో పలు చోట్ల జీ-20 సన్నాహక సదస్సులు నిర్వహించారు. అయితే.. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ముందస్తు క్షమాపణలు చెప్పారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు సందర్భంగా హస్తిన ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. సదస్సులో పాల్గొనేందుకు 30కిపైగా దేశాల అధినేతలు, యూరోపియన్ యూనియన్ అధికారులు, అతిథి దేశాల ప్రతినిధులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరవుతున్నారని ప్రధాని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 వరకు జీ20 సదస్సుతో ముడిపడిన వివిధ కార్యక్రమాలు ఢిల్లీలో జరుగుతాయని పేర్కొన్నారు.
ఈనేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపు వల్ల ఢిల్లీవాసులకు అసౌకర్యం కలిగే ఛాన్స్ ఉందన్నారు.భద్రతా కారణాల రీత్యా కొన్ని పర్యాటక ప్రదేశాలకు ప్రజలను తాత్కాలికంగా అనుమతించరని చెప్పారు. అందువల్లే దేశ రాజధాని వాసులను ముందుగా క్షమాపణలు కోరుతున్నానని మోడీ తెలిపారు. ఢిల్లీవాసులంతా వారి బాధ్యతాయుత సహకారంతో జీ20 సదస్సును సక్సెస్ చేయాలని, దేశ ప్రతిష్ట ఏమాత్రం దెబ్బతినకుండా చూడాలని పిలుపునిచ్చారు. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను కలిసిన అనంతరం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ.. విమానాశ్రయం వెలుపల భారీగా వచ్చిన తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.