పాఠశాల విద్యను వీలైనంత వరకు అందుబాటులోకి తెచ్చి సమాజంలోని ప్రతి వర్గానికీ పాఠశాల విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని ద్వారా కొత్త ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతుందన్నారు.
ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.జాతీయ విద్యా విధానం ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికీ పాఠశాల విద్యను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాలకు మా ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. దీనివలన రెసిడెన్షియల్, నాణ్యమైన పాఠశాల విద్యను మరింత విస్తృతంగా విస్తరింపజేస్తామన్నారు. మరో ట్వీట్‌లో దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనిలో భాగంగా ఢిల్లీ మెట్రో యొక్క నాల్గవ దశ కింద రిథాలా-కుండ్లి కారిడార్‌ను ఆమోదించించినట్లు పేర్కొన్నారు.కాగా, తెలంగాణకు 7 కొత్త నవోదయ పాఠశాలలను కేంద్రం మంజూరు చేయగా.. మొత్తం 16కు చేరాయి.