ఇంఫాల్‌ః మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ప్రధాన మంత్రి మోడీ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ అంశంపై స్పందించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆదివాసీ గిరిజిన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) గురువారం (జులై20) కవాతు నిర్వహించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన హుయిరేమ్ హెరోదాస్ మెయిటీ (32) ను అరెస్ట్ చేశారు.
ఇదిలావుండగా ఇద్దరు మహిళలపై ఇటీవల వైరల్ అయిన వీడియోపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్‌తో మాట్లాడారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కూడా ట్వీట్ చేస్తూ, ఈ కేసును సుమోటోగా తీసుకున్నామని ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు.