తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో ఎక్కడికక్కడ నాయకుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉందనే రిపోర్టులు వస్తున్నాయి. నాయకులు రోడ్డున పడి మరీ దూషించుకుంటున్నారు. మరికొందరు అంతర్గత కలహాలతో అట్టుడుకుతున్నారు. ఇక, ఈ పోరాటాల్లో ఇప్పుడు ఏకంగా ఓ మంత్రి వర్సెస్ ఎంపీ మధ్య వివాదం రాజుకుందని అంటున్నారు పరిశీలకులు. జగన్ సర్కారులో మంత్రిగా ఉన్న బోస్ ఇటీవల రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈయన స్థానంంలో ఇదే జిల్లాకు చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు చెల్లుబోయిన వేణును మంత్రిగా తీసుకున్నారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఆయన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేయడానికి పక్కా ప్రణాళిక వేసుకున్నారు. ఈ వ్యూహంలో భాగంగా సెప్టెంబర్ నెలలో `గుడ్ మార్నింగ్` అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పనిలో పనిగా లోకల్‌గా పార్టీ బలోపేతాన్ని కూడా ఆయన భుజానికెత్తుకున్నారు. వారంలో రెండు రోజులు ఉదయాన్నే రాజమండ్రికి వచ్చి స్థానికంగా ఉన్న డివిజన్లలో పర్యటించేలా ప్లాన్ వేసుకున్నారు. మొదటి వారం ఉత్సాహంగానే సాగింది. అందరినీ కలుపుకొని పోయారు. కానీ.. రెండో వారం వచ్చే సరికి మాత్రం ఆయన వచ్చినా.. నాయకులు రాలేదు. దీంతో తాను ఒక్కడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. అభాసుపాలవుతానని అనుకున్నారు.
అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని అటకెక్కించారు. కట్ చేస్తే.. మంత్రి చెల్లుబోయిన వచ్చినా.. తొలివారం కనిపించిన సందడి హఠాత్తుగా ఆగిపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. దీనిని కొంచెం తరచి చూస్తే.. రాజమండ్రి ఎంపీ.. భరత్ రామ్ మంత్రి దూకుడుకు కళ్లెం వేశారని చెబుతున్నారు. స్థానిక ఎంపీ అయిన.. తనకు కూడా చెప్పకుండానే మంత్రి పాదయాత్రలు నిర్వహించడంపై ఆయన ఖస్సు మన్నారు. మంత్రి ప్రోగ్రాంలో పాల్గొంటే అనుభవిస్తారు అని నాయకులను, కార్యకర్తలను ఆయన పరోక్షంగా హెచ్చరించారట.
అంతేకాదు.. మంత్రి వెంట వెళ్తున్న వారి జాబితాను కూడా ఎంపీ సిద్ధం చేసుకున్నారని తెలియడంతో నాయకులు హడలి పోతున్నారు. నిన్నగాక మొన్న మంత్రి అయిన ఆయన వెంట వెళ్లడం కంటే.. బలమైన ఎంపీ వెంటే ఉండడం బెటరని అనుకున్నారట. అయితే.. మంత్రి కూడా ఇదే రేంజ్‌లో ఆలోచిస్తున్నారట. తనకు అవమానం జరిగిందని, దీనికి అంతకింత తీర్చుకుంటానని చెబుతున్నారట. దీంతో మంత్రి వర్సెస్ ఎంపీ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందోనని వైసీపీ నాయకులు చర్చించుకోవడం గమనార్హం.