ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం అమలుతో ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు పెను కుదుపులకు గుర య్యాయి. `రాజా చెయ్యివేస్తే.. `-అన్న విధంగా మోడీ పట్టించుకుంటే.. అనే రేంజ్‌లో.. రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్న చరిత్ర గతంలోనూ ఉంది. సాధారణంగా బీజేపీకి ఏ సమస్య వచ్చినా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కలుగజేసుకుని పరిష్కరించడం రివాజు. అయితే, గోవాలో ప్రభుత్వ ఏర్పాటు, కర్ణాటకలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు వంటి విషయాల్లో మాత్రం అమిత్ షా వ్యూహాలు కూడా ఫలించలేదు.
దీంతో ప్రధాని నరేంద్రమోడీ ఆయన సమస్యలను చిటికెలో పరిష్కరించేశారు. తన వద్దకు నాయకులను పిలిపించుకోవడం, వారితో నవ్వుతూ మాట్లాడడం, హామీలు ఇవ్వడం.. ఆ వెంటనే సమస్యలకు చెక్ పెట్టడం మోడీకి రాజకీయంగా అబ్బిన విద్య. తాజాగా ఆయన మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ సంక్షోభం పై దృష్టి పెట్టారు. దాదాపు నెలరోజులుగా ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై తర్జన భర్జన సాగుతోంది. బీజేపీ-శివసేన మధ్య పదవుల విషయంలో గింజులాట సాగుతోంది.
ఈ క్రమంలో అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు. ఎన్సీపీ-కాంగ్రెస్‌లు కూటమిగా ఉండి.. శివసేనకు మద్దతివ్వాలని, శివసేనకు సీఎం పదవిని దక్కేలా చే యాలని భావించారు. అయితే, ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకోరాదని భావించిన బీజేపీ.. మోడీని రంగంలోకి దింపిందా అన్నట్టుగా ప్రధాని కార్యాలయం నుంచి ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు ఫోన్ రావడం, ఆయన వెళ్లడం, ప్రధానితో చర్చించడం.. ఆ వెంటనూ అనూహ్యంగా శనివారం తెల్లవారేసరికి.. బీజేపీకి ఎన్సీపీ మద్దతివ్వడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం వంటివి జరిగిపోయాయి. సో.. ఇదీ మహారాష్ట్ర పై మోడీ ప్రభావం.
ఇక, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే.. ఏపీలో ఎదగాలని మోడీ, అమిత్ షాలే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అదికారంలోకి తీసుకువచ్చేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వారు వినియోగించుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రధాని మోడీ స్వయంగా పలకరించడం సంచలనంగా మారింది. అయితే, వైసీపీలో విజయసాయిరెడ్డిని కూడా మోడీ ఆప్యాయంగానే పలకరిస్తారు.
అంత మాత్రాన ఆయనను పార్టీలో చేర్చుకున్నట్టు కాదని అనుకున్నా. కృష్ణంరాజు విషయంలో మాత్రం డిఫరెంట్ అంటున్నారు పరిశీలకులు. గతంలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని భుజం తట్టిన వారంలోనే వారు కట్టగట్టుకుని నలుగురు బీజేపీలోకి చేరిపోయారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహమేదో ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే, సదరు వ్యూహం ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో అమలు చేయొచ్చని అంటున్నారు.