నాలుగో సిద్ధం స‌భ తేదీ మార్పు.. 15 ల‌క్ష‌ల మందితో స‌భ నిర్వ‌హ‌ణ‌కు ప్లాన్‌

-

ఏపీలో అధికార వైసీపీ నాలుగో సిద్ధం సభ తేదీని మార్చింది. ఈ నెల 19వ తేదీన‌ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తోంది.రాప్తాడులో సుమారు 12 లక్షల మందితో సిద్ధం మూడ‌వ సభను నిర్వహించిన వైసీపీ…నాలుగో స‌భ‌కు 15 ల‌క్ష‌ల మందిని త‌ర‌లించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది.ఇందుకోస‌మే స‌భాస్థ‌లిని భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. 15 ల‌క్ష‌ల‌కు మించి జ‌నాభా ప‌ట్టేలా మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు హాజరుకానున్నారు. ఇందుకోసం సుమారు 500 ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్ర‌తి స‌భ‌లో ఏదో ఒక ప్ర‌త్యుక‌త‌ను చాటుకుంటున్న సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగం ఈసారి మ‌రింత కొత్తగా ఉంటుంద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందు ఇదే చివ‌రి స‌భ కావ‌డంతో ఫైనల్ సభ కేడర్‌ను మరింత సమాయత్తపరిచేలా ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు.

సార్వ‌త్రిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్త‌పరిచే విధంగా సిద్ధం సభలు నిర్వహిస్తున్న వైసీపీ…తొలి సభను ఉత్తరాంధ్ర జిల్లాల కోసం విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో నిర్వ‌హించింది.ఈ స‌భ‌లోనే సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించారు. రెండో సభను ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి దెందులూరు నియోజకవర్గంలో జ‌రిపారు.ఇక మూడో సభను రాయలసీమ జిల్లాలకు సంబంధించి రాప్తాడులో భారీ ఎత్తున నిర్వహించి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీశారు సీఎం జ‌గ‌న్‌. నాలుగో సిద్ధం సభలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని భావించిన సీఎం జ‌గ‌న్‌…. ప్ర‌త్యేక‌త‌ను చాటేలా నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు.ప‌ల్నాడు ప్రాంతంతో పాటు ప్ర‌కాశం,నెల్లూరు,తిరుప‌తి జిల్లాల‌కు చెందిన కేడ‌ర్‌ను స‌మాయ‌త్త‌ప‌ర‌చ‌డ‌మే ఈ స‌భ ల‌క్ష్యం. ఈ నేపథ్యంలో నాలుగో సిద్ధం సభ నిర్వహణకు అనువైన ప్రాంతంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోకజవర్గ పరిధిలోని మేదరమెట్లలో నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. రాప్తాడులో నిర్వహించిన సభకు రెట్టింపు స్థాయిలో మేద‌ర‌మెట్ల స‌భ‌ను నిర్వహించేందుకు వైసీపీ సన్నద్ధమవుతోంది.

చివ‌రిదైన మేద‌ర‌మెట్ల సిద్ధం సభ ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి ప‌రిశీలించారు. ఈ నెల 10వ తేదీన తొలుత నాలుగో సిద్ధం స‌భ నిర్వ‌హించాల‌ని అనుకున్నా….కొన్న అనివార్య కార‌ణాల వ‌ల‌న‌మ‌రో ప‌దిరోజులు పొడిగించారు.రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధించడమే ల‌క్ష్యంగా ఈ స‌భ నిర్వ‌హిస్తున్నామ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.జ‌గన్‌ పాలనలో ఏపీ అభివృద్ధి చెందిందని, కాబట్టే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఎన్నిలకు సిద్ధం చేసేందుకు జరుగుతున్న సభలకు మంచి స్పందన వస్తోందన్నారు. సభకు 15 లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. వైసీపీ సంక్షేమ పాలనలో రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన 20 ఎకరాల్లో సభ పెట్టి.. ఆరు లక్షల మంది వచ్చారని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.75 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సీఎం జగన్‌ పదవులు ఇచ్చారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వ‌చ్చిన తరువాత మ‌రింత ఉత్సాహంతో ప్ర‌చారం చేప‌డ‌తామ‌ని విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version