ఏపీ సీఎంగా జగన్ పాలన ప్రారంభించి కేవలం 4 మాసాలే అవుతోంది. అయితే, ఈ నాలుగు మాసాలను నిశితంగా పరిశీలిస్తే.. చాలా కార్యక్రమాలను ఆయన ప్రవేశ పెట్టారు. అమలు చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు అందరూ చెప్పుకొనే మాట. అయితే, అదేసమయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు.. పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్న విధానం కూడా చర్చనీయాంశం. ఎక్కడ ఉపన్యాసం చేసినా.. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. ఎంత వరకు మాట్లాడాలో.. అంతే మాట్లాడుతున్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలకు.. చరిత్ర తవ్వకాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఇది ఆయనను మేదావి వర్గాల్లో మరింతగా ఇనుమడింప జేస్తోంది. ఒక్కసారి గత సీఎం చంద్రబాబు వ్యవహార శైలిని గమనిస్తే.. ఈయనకు జగన్‌కుఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తోంది.
గత సీఎంగా చంద్రబాబు ఎక్కడ మైకు పట్టుకున్నా.. ఏ వేదిక ఎక్కినా.. లాంగ్ లాంగ్ ఎగో.. సోలాంగ్ ఎగో.. అంటూ చరిత్ర తవ్వకాలకు దిగేవారు. తాను చెప్పాలనుకున్న నాలుగు ముక్కలకు నలభై అతుకులు జోడించి మరీ.. చెప్పుకొచ్చేవారు. ఫలితంగా సభలకు సమావేశాలకు వచ్చేవారి నుంచి వచ్చిన వారి వరకు కూడా భయంతో ఒణికి పోయేవారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్ లు అయితే.. మరింతగా బాధపడిపోయేవారు. నిజానికి చంద్రబాబు చెప్పాలనుకునే విషయం కన్నా.. జరిగిపోయిన విషయాలు.. గతంలో చేసిన తప్పులను ఏకరువు పెట్టుకోవడం, చప్పట్లు కొట్టించుకోవడం ఎక్కువనే పేరు తెచ్చుకున్నారు.
కానీ, జగన్ విషయానికి వస్తే.. ఈ రెండింటికీ ఆయన కడు దూరంలో ఉన్నారు. తాను ఏం చేయాలనుకున్నారో.. చెప్పడం.. చెప్పింది చేయడం.. అంతే! ఏ వేదిక ఎక్కినా.. ఎవరినీ నొప్పించకుండా.. ఎవరినీ బాధ్యులను చేయకుండా.. ప్రభుత్వం మనది.. అందరం సేవకులం .. అనే ధోరణిని కనబరుస్తున్నారు. తాజాగా వైఎస్ ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలోనూ ఆయన అదే ధోరణిని ప్రదర్శించారు. నిజానికి నాలుగు మాసాల పాలనలో అనేక విజయాలు ఉన్నాయి. అదేసమయంలో అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్షాల నుంచి కూడా అనేక విమర్శలు కూడా ఉన్నాయి.
అయినా కూడా వాటిని ఎక్కడా స్పృశించకుండానే తాను చెప్పాలనుకున్న నాలుగు ముక్కలు చెప్పి.. రవాణా కార్మికులతో జైకొట్టించుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఇది.. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఇలాంటి సీఎంనే కావాలని కోరుకున్నామని అనే రేంజ్‌కు తీసుకువెళ్తోంది. ఈ పరిణామాన్ని గమనిస్తున్న చంద్రబాబు అభిమానులు, టీడీపీ సానుభూతి పరులు కూడా బాబు ఎక్కడో ఏదో మిస్పవుతున్నారనే ధోరణిని కనబరుస్తుండడం గమనార్హం. నిజమే కదా!?