ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల అవకతవకలకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై మూడ్రోజుల ఏసీబీ విచారణ ఈ సాయంత్రం ముగిసింది. గతంలో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా అది ఈ సాయంత్రంతో ముగిసింది. గుంటూరు జీజీహెచ్‌లో ఇవాళ మొత్తం మూడున్నర గంటల పాటు విచారించారు అధికారులు. మూడు రోజుల్లో కలిపి దాదాపు పన్నెండు గంటల పాటు అచ్చెన్నాయుడు విచారణ సాగింది.
కాగా ఈ రిమాండ్ గడువు నేటితో ముగియడంతో.. ఏసీబీ కోర్టు రిమాండ్ ను జూలై 10 వరకు పొడిగించింది. అచ్చెన్నాయుడు గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడిని ఎప్పుడు డిశ్ఛార్జి చేస్తారనేది ఇంకా తెలియరాలేదు. ఆపరేషన్ గాయం నుంచి అచ్చెన్నాయుడు దాదాపు కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.