ఈసారి తెలంగాణలో ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ గెలుపు సునాయాసం అనుకున్నా అక్కడ మాత్రం కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. కొన్నిచోట్ల బిజెపి కూడా బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తోంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాత్రమే హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పవచ్చు.
అటువంటి నియోజకవర్గాలలో బాల్కొండ ఒకటి. ఈ నియోజకవర్గం ప్రశాంతతతో, ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఈసారి కూడా బిఆర్ఎస్ వేముల ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. రెండుసార్లు గెలిచిన వేముల ప్రశాంత్ రెడ్డి ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రిగా, కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ నియోజకవర్గం లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ మొదలైన అభివృద్ధి పనులలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లానని అవే అతనిని గెలిపిస్తాయని ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి బాల్కొండ ప్రజలు ఏం చేస్తారో?
కాంగ్రెస్ నుంచి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇతను గతంలో ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పొందారు. ఈసారి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతోపాటు జిల్లాలో పుంజుకున్న కాంగ్రెస్ హవాతో ఖచ్చితంగా గెలిచి తీరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా ఏలేటి అన్నపూర్ణ పేరును ప్రకటించారు. అన్నపూర్ణ వేముల ప్రశాంత్ రెడ్డికి అసలు పోటీయే కాదని బిఆర్ఎస్ నేతలు అంటుంటే, వేములకు గట్టి పోటీ ఇస్తామని బిజెపి నేతలు అంటున్నారు.
మరి బాల్కొండ ప్రజలు ఎవరి వైపు చూస్తారో వేచి చూడాల్సిందే….