తెలంగాణ ప్రభత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని హైదరాబాద్ వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా వ్యాఖ్యానించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపధ్యంలో కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. అవసరమైన మేరకు కరోనా పరీక్షలు చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో మాత్రం కనీసం వేల సంఖ్యలో కూడా చేయట్లేదని చెప్పారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని, వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.