ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై మంత్రి బొత్సా సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మండలిని రద్దు చేయడం ఖాయమని స్పష్టం చేసారు. ఏపీ అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేసే అంశ౦పై చర్చ జరుగుతుందని తాజాగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, CRDA ఉపసంహరణ బిల్లుల విషయంలో విచక్షణాధికారాల్ని వినియోగించి,
నిబంధనల్ని తుంగలో తొక్కారని బొత్సా ఆగ్రహం వ్యక్తం చేసారు. మండలి ఛైర్మన్ విచక్షణాధికారాల్ని ఉపయోగించడానికి ఇది సరైన సందర్భం కాదని బొత్సా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు ఇలాంటి మండలి వ్యవస్థ ఉండాలా అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుందని, చంద్రబాబు తొత్తుల్ని, తాబేదార్లనూ ఉన్నత పదవుల్లో ఎలా కూర్చోబెడతారని మంత్రి నిలదీశారు.
నిబంధనలు పాటించాలని సభలో సగం మంది చెప్పినా ఛైర్మన్ పాటించలేదని తప్పు చేశా అని స్వయంగా చైర్మన్ చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు మండలిలోకి ఏ విధంగా సెల్ ఫోన్లు అనుమతిస్తారని ప్రశ్నించారు. మండలిని రద్దు చేయడానికి అన్ని మార్గాలు చూసి ముందుకి వెళ్తామని అన్నారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలిని రద్దు చేసే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.