మంత్రి ఆదిమూలపు స్థానంలో మంత్రి బొత్స వచ్చారు. శాఖ పరమైన మార్పు కారణంగా బొత్స అస్సలు తనకు విద్యా శాఖ వద్దే వద్దని తేల్చేశారు. అయినా కూడా శాఖ మార్పు అన్నది సాధ్యం కాలేదు. ఆదిమూలపు సురేశ్ కు మున్సిపల్ శాఖ బాధ్యతలు దఖలు పడ్డాయి. ఈ శాఖను నిన్నమొన్నటి వరకు బొత్సే చూశారు. అదే సమయాన బొత్సకు నిన్నటి వరకూ సురేశ్ నిర్వహించిన విద్యాశాఖ బాధ్యతలు దఖలు పడ్డాయి.
దీంతో తనకు అస్సలు ఈ శాఖపై పట్టే లేదని కూడా తేల్చేశారు. అయినా కూడా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు శాఖల మార్పు అన్నది సాధ్యం కాదని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో చాలా కష్టంగానే ఆయన ఈ శాఖను చూస్తున్నారు. ఇప్పటిదాకా తన శాఖకు సంబంధించి బాధ్యతలు (ఛార్జ్ )ను తీసుకోలేదు. అదేవిధంగా తన ఛాంబర్ కు కూడా వెళ్లలేదు. అయినా కూడా పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఆయనే స్పందిస్తున్నారు.ఏ ఆరోపణ వచ్చినా ఆయనే తిప్పి కొడుతున్నారు. అయినా కూడా సమస్యలు ఆగడం లేదు. ఆరోపణలు ఆగడం లేదు. నిర్వహణ లోపం అన్నది అస్సలు దిద్దుబాటుకు నోచుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే…
రెండేళ్ల పాటూ కాలం ఏ సమస్యలూ లేకుండానే గడిచిపోయింది. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. రద్దయ్యాయి. ఆ తరువాత ప్రత్యేక పరిస్థితుల రీత్యా అందరూ పాస్. దీంతో విద్యార్థుల ఆనందాలకు అవధే లేదు. ఏదో ఒక విధంగా పరీక్షలు నిర్వహిద్దాం అనుకున్నా కరోనా భయం కారణంగా అలాంటి ప్రయత్నాలేవీ చేయవద్దని తల్లిదండ్రులు అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో న్యాయ స్థానాలు కూడా అప్పటి మహమ్మారి రాక, విజృంభణ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి వెనక్కు తగ్గమనే చెప్పాయి. వాస్తవానికి పదోతరగతి పరీక్షల నిర్వహణ అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. కానీ మన పాలకులకు భయం లేదు కదా! అందుకే సవాళ్లను చూసీ చూడని విధంగా వదిలేస్తున్నారు. అందుకనో, ఎందుకనో వరుస ఉదంతాలు మనల్ని వేధిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏ విధంగా చూసుకున్నా టీచర్ల కాసుల కక్కుర్తి ప్రయివేటు విద్యా సంస్థల ఆరాటం అన్నీ కలిసి ఏపీలో పదో తరగతి ప్రశ్న పత్రాలు వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఇంకా అనేక చోట్ల ఈ చీకటి వ్యవహారం వెలుగులోకి రాకుండానే పోతోందని విపక్షం అభియోగాలు నమోదు చేస్తోంది. అయినా మన మంత్రి గారు చెప్పిన ప్రకారం లీకేజీ లేదు. మన పోలీసులు చెప్పిన ప్రకారం మాల్ ప్రాక్టీసు ఉంది. అంటే చూచిరాతలు అన్నవి నిబంధనలకు విరుద్ధం కాదు అన్నది వారి మనోగతం లేదా మనోభావం అయి ఉంటుంది.