తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఆన్ లైన్ పద్దతిలో మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జత చేసే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం.
అయితే ప్రభుత్వం ప్రకటించిన కనీసం 24 గంటలు కూడా కాకముందే వాటికి ఈసీ బ్రేక్ వేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలనే సమాచారం తెలిసిన వెంటనే కొందరూ శుక్రవారం రాత్రే దరఖాస్తు చేసుకోగా.. మరికొందరూ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఈసీ బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఇప్పట్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయ్యేది గగనమే అని పలువురు పేర్కొంటున్నారు.