తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. దాదాపు సీట్ల కోసం నేతలు కుస్తీలు పడుతున్నారు. ఇదే క్రమంలో సిఎం కేసిఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ లో పోరు మొదలైంది. మెదక్ అసెంబ్లీ స్థానంలో చాలా రోజుల నుంచి రచ్చ నడుస్తోంది.
ఆ రచ్చ ఇప్పుడు మరింత ముదిరింది. ఇక్కడ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్ వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. ఇప్పటికే మెదక్లో పద్మా, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వర్గాల మధ్య రచ్చ ఉంది. ఇక ఇటీవలే మైనంపల్లి వారసుడు మెదక్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సీటు దక్కించుకోవాలని రాజకీయం మొదలుపెట్టారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పద్మా దేవేందర్‌కు పోటీగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో సోషల్ మీడియాలో రెండు వర్గాలు పోటాపోటిగా రాజకీయం నడిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఫోన్లు చేసి బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఇక మా నేత జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ మైనంపల్లి వర్గం నేతలు..పద్మా వర్గం వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయడంతో చివరకు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో ఎవరెన్ని చేసిన వచ్చే ఎన్నికల్లోనూ మెదక్ నుంచి బీఆర్‌ఎస్ టికెట్ పద్మారెడ్డికే వస్తుందని ఆమె భర్త, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అంటున్నారు.
అయితే గతంలో మెదక్ అసెంబ్లీ బరిలో టిడిపి నుంచి మైనంపల్లి హనుమతరావు గెలిచారు. దీంతో అక్కడ ఆయనకు కాస్త పట్టు ఉంది. అందుకే అక్కడకు తన తనయుడుని పంపించారు. సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.