తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ బీటలు వారిందా ? రానున్న రోజుల్లో కారు షెడ్డుకు వెళ్లడం తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రోజు రోజుకు ఆ పార్టీని నేతలు వీడుతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కారు దిగి వెళ్లిపోగా…. మరికొందరు అదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గులాబీ గుంపు గందగోళం నెలకొంది. ఎవరు ఉంటారో ? ఎవరు పోతారో ? పసిగట్టలేక అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీలు జంప్ గాకా… ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో కేసిఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎమ్మెల్యేలెవరూ ఆ పార్టీలో మిగలరని, హస్తం పార్టీ అంటోంది. దానం నాగేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని హస్తం పార్టీ సైతం అమలు చేస్తోంది. ఎమ్మెల్యేలకు గేట్లు ఎత్తినట్లేనని చెబుతోంది. దీంతో పార్టీని వీడేది ఎవరు? మిగిలేది ఎవరనే దానిపై చర్చ మొదలైంది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ కేడర్‌లో నైరాశ్యం ఏర్పడింది. అధికారం ఉన్నప్పుడు కారు పార్టీలో సందడి చేసిన నేతలు, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు జై కొడుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు కారు పార్టీ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాగా.. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి వెళ్లగా, మరికొందరు ఎమ్మెల్యేలు రూట్ క్లియర్ చేసుకుంటున్నారట. బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేయడానికి అవసరమైన 26 మంది ఎమ్మేల్యేలే టార్గెట్‌గా.. కాంగ్రెస్ మొదలు పెట్టిన ఆపరేషన్‌లో భాగంగానే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరంగనే, బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మొదటగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు సీఎంను కలిసారు. మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం తన కుటుంబ సభ్యులతో రేవంత్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ రేవంత్ రెడ్డి విముఖత చూపడంతో బెంగుళూరుకు వెళ్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌తో చర్చలు జరిపారు. ఈ వ్యవహారాలు కారు పార్టీని కలవరపెట్టాయి. దాంతో కేటీఆర్, హరీష్‌రావులు పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో వరుస భేటీలు నిర్వహించి, నేతలు జారి పోకుండా ఉండేందుకు ప్రయత్నించారు. కానీ అవేవీ ఫలించలేదు. కేటీఆర్, హరీష్‌రావులే కాదు.. అధినేత కేసీఆర్ మాటలు కూడా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వినడంలేదని తాజా పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. పార్టీ కార్యక్రమాలను కూడా నేతలు లైట్ తీసుకుంటున్నారట. దీంతో బీఆర్‌ఎస్ కోటకు బీటలు వారాయని, రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనడుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లిపోతుండటంతో బీఆర్ఎస్ అధిష్ఠానం అలెర్ట్ అయ్యింది. తమ ప్రజాప్రతినిధుల వలసలను ఆపేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా.. ముందుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చిందట. ఈ మేరకు స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చి చట్ట పరంగా పోరాటం చేయాలని, ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారట. ఇప్పటికే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. స్పీకర్‌కు పిటిషన్ సైతం ఇచ్చారు. అయితే.. బీఆర్ఎస్ అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకున్నా, వలసలు ఆగవని రాజకీయవర్గాలు అంటున్నాయి.