చంద్ర‌బాబు క‌ళ్ల‌కు మ‌ళ్లీ కంత‌లు..!

-

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మళ్ళీ సర్వేలు మొదలుపెట్టారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం ఆ పార్టీ చరిత్ర‌లోనే ఎదుర్కోలేన‌న్ని ఇబ్బందులు పడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక అధికారంలో ఉన్న సమయంలో పదే పదే సర్వేలు చేయించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు… సర్వేలు చేసి సీట్లు ఇస్తానని 2017లో రాజమండ్రిలో ప్రకటించిన తర్వాత ఆ విధంగానే ముందుకి వెళ్లారు. దీని వల్ల‌ ప్రయోజనం ఎంత వచ్చింది అనేది పక్కన పెడితే ఆ సర్వేల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయింది అనేది వాస్తవం.

సర్వేలు చేసే సభ్యులు సీట్లు ఆశించిన వాళ్లకు మెరుగ్గా సీట్లు ఇవ్వడం వంటివి జరిగాయి. వింత ఏంటి అంటే 2018 లో జరిగిన ఒక సర్వేలో పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గే అవకాశం ఉందనే ప్రచారం ఆశ్చర్యాన్ని కలిగించింది. నెల్లూరు జిల్లాలో నారాయణ భారీ విజయం సాధిస్తారు, గోదావరి జిల్లాల్లో అన్ని స్థానాలు మనకే వస్తాయి… ఉత్తరాంధ్ర స్వీప్ అనే సినిమా డైలాగులు చంద్రబాబుకి ఎక్కువగా వినిపించారు. వాటిని నమ్మిన చంద్రబాబు ఆ విధంగానే ముందుకి వెళ్లారు.

అటు ఒక‌టి రెండు ప్రైవేటు ఏజెన్సీల‌తో పాటు అప్పటి ఇంటిలిజెన్స్ విభాగంలో కీల‌క నేత‌గా ఉన్న వ్యక్తి ఆధ్వ‌ర్యంలో చేయించిన ప‌లు స‌ర్వేలనే ఆధారంగా చేసుకుని సీట్లు ఇచ్చారు. చినబాబు కనుసన్నల్లో జరిగిన ఈ సర్వేలు పార్టీని నిలువునా ముంచాయి అనేది వాస్తవం. జాతీయ స్థాయిలో చంద్రబాబు వెళ్లడం రాష్ట్రంలో కలిసి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సర్వేలు చేయించడం మొదలుపెట్టారు. జిల్లాల వారీగా ప్రభుత్వంపై వ్యతిరేకత మీద సర్వేలు చేయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కొంత మందికి పని అప్పగించారట. ఎన్నిక‌లు జ‌రిగి కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌లు కూడా కాలేదు. ప్ర‌భుత్వం ఇంకా కుదురుకోలేదు. మరోవైపు చాలా వ‌ర‌కు ఉద్యోగాలు వ‌చ్చాయి.

యువ‌త‌తో పాటు కొన్ని వ‌ర్గాలు జ‌గ‌న్ పాల‌న పట్ల సంతృప్తిగానే ఉన్నారు. మ‌ళ్లీ ఇప్ప‌టికిప్పుడు స‌ర్వేలు ఎందుకో ? అర్థం కాని ప‌రిస్థితి. పోని ఇవి నిస్ప‌క్ష‌పాతంగా జ‌రిగేవా ? అంటే బాబుకు అనుకూలంగా రిపోర్టులు ఇవ్వ‌డం ఆయ‌న వాటిని గుడ్డిగా ఫాలో అవ్వ‌డ‌మేగా జ‌రిగేది.. ?  ఇసుక, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అందుతున్నాయా లేదా అనే సర్వేలను జరుపుతున్నారట ఆయన. ముందు కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం. పార్టీ ఘోరంగా నష్టపోయిన సమయంలో కూడా ఇవి ఎందుకు అనేది కార్యకర్తలకు అంతుబట్టడం లేదు. అంటే ఈ స‌ర్వేల‌తో మ‌ళ్లీ బాబు క‌ళ్ల‌కు కంత‌లు క‌ట్ట‌డం ఖాయ‌మైన‌ట్టే..?

Read more RELATED
Recommended to you

Exit mobile version