ఐఎన్‌ఎక్స్ మీడియా, అక్రమ నగదు చలామణీ కేసుల్లో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరానికి ఇటీవల ఢిల్లీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, తనకు హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, దానిపై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసి, విచారిస్తోంది. ఆయన సుమారు 90 రోజులుగా జైలులోనే ఉంటున్నారు. ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్టు ఇటీవల ఢిల్లీ హైకోర్టు తెలిపింది.