మెగాస్టార్ చిరంజీవికి-రాజకీయాలకు ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఆయన మెగాస్టార్ అనిపించుకున్నారు. అయితే, రాజకీయంగా మాత్రం అటు ఫెయిల్ అయ్యారని, ఇటు సక్సెస్ అయ్యారని చెప్పలేం. ఎప్పుడు అవకాశం ఎటు ఉంటే.. అటు మొగ్గడంలో చిరంజీవి సిద్ధహస్తుడనే వ్యాఖ్యలు వున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి తర్వాత.. కేంద్రంలో మంత్రి పదవిని, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా నిన్న మొన్నటి వరకు అనుభవించారు.
సరే! మరి ఇప్పుడు ఆయన ఎటున్నారు ? ఏం చేస్తున్నారు ? అంటే.. ఏ పార్టీలోనూ ఆయన ప్రత్యక్షంగా పాలు పంచుకోవడం లేదు. తన సొంత సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీపై ఇప్పటి వరకు మాట మాత్రం కూడా స్పందించలేదు. మరో సోదరుడు నాగబాబు పార్టీలో నేతగా ఉన్నారు. గత ఏడాది ఎన్నికల్లో పోటీ కూడా చేసి ఓడిపోయారు. ఇక, ఇప్పుడు పార్టీలోనే ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే పవన్ పార్టీ బీజేపీతో జట్టు కట్టింది. ఆ పార్టీతో కలిసి రాబోయే రోజుల్లో ఏపీలో ప్రభుత్వంపై సమరానికి సన్నద్ధమవుతోంది. అయితే, ఈ క్రమంలో చిరును కూడా బీజేపీవైపు నడిపించే ప్రయత్నాలు సాగుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి ఊతం ఇచ్చేలా ఇటీవల చిరు కుటుంబంలోనే ఓ ఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్‌కు బ్యానర్ కడుతూ ఇటీవల చిత్తూరులో మృతి చెందిన ముగ్గురు యువకుల విషయంలో రామ్‌చరణ్ స్పందించారు. అటు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం స్పందించి తన వంతుగా ఒక్కో మృతుడు కుటుంబానికి రు. 2 లక్షలు ఇచ్చారు. నిజానికి ఈ పరిణామం వెనుక.. పవన్ పార్టీ విషయంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న చిరంజీవిని కదిలించేందుకు, అదే సమయంలో బీజేపీతోనూ జట్టు కట్టేలా ప్రోత్సహించడమనే వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు.
నిన్న మొన్నటి వరకు వేర్వేరుగా ఉన్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు అంతా ఒక్క తాటిమీదకు రావడంతో పాటు తాము సైతం రాజకీయంగా ఎదిగే ప్లానింగ్‌లో ఇప్పటి నుంచి అండర్ కరెంట్‌గా వర్క్ ప్రారంభించిందంటున్నారు. బీజేపీకి చేరువ అయితే.. రాబోయే రోజుల్లో చిరుకు రాజ్యసభ సభ్యత్వం సహా.. కుదిరితే.. కప్పు కాఫీ అన్నట్టు కేంద్రంలో పదవి దక్కినా దక్కొచ్చని అంచనాలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి చిరు కుటుంబంలో కమలం వికసిస్తుందో లేదో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.