అమిత్ షాతో మాజీ తమ్ముళ్ళు.. బాబు కోసమేనా?

-

బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం అయిన దగ్గర నుంచి బీజేపీ మద్ధతు కోసం బాబు పరితపిస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం ఎక్కడకక్కడ బాబుని దూరం పెడుతూనే వస్తుంది. మళ్ళీ బాబుతో కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేస్తుంది. ఈ మధ్య ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన బాబుకు మోడీ, అమిత్ షాలు సైతం అపాయింట్‌మెంట్ ఇవ్వని విషయం తెలిసిందే.

అయితే బద్వేలు పోలింగ్ ముందు బాబుతో అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత… బద్వేలులో టీడీపీ పరోక్షంగా బీజేపీకి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే బద్వేలులో బీజేపీకి 21 వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి బీజేపీ-టీడీపీ పొత్తు సెట్ అవుతుందని ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ఏపీ బీజేపీ సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్ మాత్రం, టీడీపీతో పొత్తు లేదని తేల్చి చెప్పేశారు. అసలు ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

కానీ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాత్రం… పొత్తులు డిసైడ్ చేసేది ఇంచార్జ్‌లు కాదని, మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు అన్నట్లు మాట్లాడారు. ఈ అంశంపై వారితోనే డైరక్ట్‌గా మాట్లాడతామని చెప్పారు. ఈ క్రమంలోనే తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షాతో సీఎం రమేశ్‌, సుజనా చౌదరిలు భేటీ అయ్యారు. సుమారు గంటన్నరకు పైగా పార్టీ పరిస్థితిపై చర్చ నడిచినట్లు తెలుస్తోంది. అయితే సుజనా, రమేష్‌లు బాబు మాజీ రైట్ హ్యాండ్లు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక వారిద్దరు టీడీపీతో పొత్తు పెట్టుకునేలా బీజేపీని సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షాతో భేటీ అని తెలుస్తోంది. మరి ఈ మాజీ తమ్ముళ్ళు బాబుని బీజేపీకి ఎంత దగ్గరగా తీసుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version