దళిత, గిరిజనుల ఆత్మగౌరవ దండోరా పేరుతో ఇంద్రవెల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ” ఇంద్రవెల్లి దండోరా ” ( Indravelli Dandora ) భారీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అనుకున్న విధంగానే ఈ సభ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఈ సభకు జనం భారీ ఎత్తున వచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధికారం కోల్పోయాక, ఇంత భారీ స్థాయిలో సభ ఎప్పుడు జరగలేదనే చెప్పొచ్చు. అయితే ఈ సభలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇక ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి పలు లక్ష్యాలని నెరవేర్చుకున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా కాంగ్రెస్‌లో ఏకనాయకత్వం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమదే ఆధిపత్యం అనుకుంటారు. ఒక్క వైఎస్సార్ ఉన్నప్పుడు..ఆయన బాటలో కాంగ్రెస్ నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని తన గ్రిప్‌లో తీసుకురావడానికి సభ బాగా ఉపయోగిపడినట్లు కనిపిస్తోంది.
ఈ సభ ద్వారా కాంగ్రెస్ బలంగానే ఉందని రుజువు చేశారు. టీఆర్ఎస్‌కు బీజేపే కాదు..కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో వచ్చేలా చేశారు. ఇంకా చెప్పాలంటే ఇంద్రవెల్లి వేధికగా రేవంత్ బలప్రదర్శన చేసి, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులని ఆకర్షించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా దళిత బంధు ద్వారా కేసీఆర్…రాష్ట్రంలోని దళితులని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా, దానికి కౌంటర్‌గా దళితులు, గిరిజనులతో సభ పెట్టి, వారు కాంగ్రెస్ వైపే ఉన్నారని చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఒక్క ఇంద్రవెల్లి సభ ద్వారా రేవంత్ రెడ్డి అనేక లక్ష్యాలని నెరవేర్చుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి, తాను అనుకున్న లక్ష్యాలని చేరుకోవడంలో కాస్త సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.