తెలంగాణ రాజకీయాల్లో టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి….అధికార టిఆర్‌ఎస్‌పై ఏ విధంగా పోరాడుతున్నారో అందరికీ తెలిసిందే. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి దూకుడుగా రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ టిఆర్‌ఎస్‌పై ఎటాకింగ్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. అలాగే తమ పార్టీ బలం ఏంటో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే క్రమంలో రేవంత్ మొదట నుంచి పక్కా ప్లాన్ ప్రకారమే రాజకీయం నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్నటివరకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు బిజేపి ప్రత్యామ్నాయం అన్నట్లు రాజకీయం నడిచేది…కానీ దానికి రేవంత్ బ్రేక్ వేశారు. కాంగ్రెస్‌ని రేసులోకి తీసుకొచ్చారు. అలాగే టిఆర్‌ఎస్‌తో పాటు బిజేపిని కూడా తెలంగాణ ప్రజల్లో విలన్ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. మొదట్లోనే పెట్రోల్, డీజిల్ రేట్లపై ఆందోళనలు చేసి, టిఆర్‌ఎస్-బిజేపిలని టార్గెట్ చేశారు.
తాజాగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌తో పాటు సిపిఐ, సిపిఎం, టిడిపి, టిజేఎస్, న్యూ డెమాక్రసీ ఇలా చిన్నాచితక పార్టీలతో కలిసి ధర్నా చేశారు. అయితే ఈ కార్యక్రమానికి బిజేపిని ఆహ్వానించలేదు. అంటే కేంద్రంలో అధికారంలో ఉండటంతో బిజేపిని కూడా టార్గెట్ చేశారు. అంటే ఇటు టిఆర్‌ఎస్, అటు బిజేపిల లక్ష్యంగా రేవంత్ విమర్శల వర్షం కురిపించారు. నెలాఖరికి ప్రతిపక్షాలతో కలిసి ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేయనుంది. రేవంత్…భద్రాచలంలో నిరసన కార్యక్రమం చేస్తారు.
అంటే రాష్ట్రంలో మిగిలిన ప్రతిపక్షాలని కలుపుకుపోతూనే..టిఆర్‌ఎస్, బిజేపిలని లక్ష్యంగా చేసుకుని రేవంత్ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల దృష్టిలో టిఆర్‌ఎస్‌ని ఎలా విలన్ చేస్తున్నారో…అలాగే బిజేపిని కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటు మిగిలిన విపక్షాలని కలుపుకుని ప్రజలకు కాంగ్రెస్ ఒక్కటే ఆప్షన్‌గా కనిపించేలా ప్లాన్ చేశారు.