కెసీఆర్‌పై పేలుతున్న సెటైర్లు.. న‌వ‌గ్ర‌హ మ‌హాయాగంతో అవ‌రోధాలు తొల‌గుతాయా

-

భారీ వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ రాష్ర్టం క‌ల్లోలంగా మారినా ప్ర‌తిప‌క్ష నేత కెసీఆర్‌ జాడ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు మాజీసీఎంపై కాస్త ఆగ్ర‌హంగానే ఉన్నారు.దీంతో కేసీఆర్ కనిపించుట లేదు- అనే ప్రకటనలు సైతం వ‌చ్చేశాయి. అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ రాజకీయ నిశబ్దాన్ని పాటిస్తునే ఉన్నారు. తెలంగాణలో కురిసిన వర్ష బీభత్సానికి అటు హైద్రాబాద్ వాసులు, ఇటు ఖమ్మం ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు.

అయినా కేసీఆర్‌కి బాధితుల ఆవేద‌న కనిపించడం లేదు.వినిపించ‌డం లేదు. దీనితో కేసీఆర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు ఊపందుకున్నాయి. పదవి ఉంటేనే ప్ర‌జ‌లు గుర్తుకొస్తారా..? అని ప్ర‌శ్నిస్తున్నారు. గెలిస్తేనేనా రాష్ట్రం, ఓడితే కనీసం కష్టాలలో ఉన్న ప్రజలను పరామర్శించడానికి కూడా బయటకు రారా.? అంటూ కాంగ్రెస్‌తోపాటు బాధిత ప్ర‌జ‌లు కేసీఆర్ తీరును తప్పుబడుతున్నారు. ఇన్నాళ్ళుగా కూతురు కవిత అరెస్టైన‌ నేపథ్యంలో కేసీఆర్ మౌనం వహించారు.అయితే ఆమె జైలు నుంచి విడుద‌లైనా ఇంకా మౌనంగానే ఉన్నారు కెసీఆర్‌.

వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ఒక్క‌సారి కూడా బ‌య‌టికి రాని కెసీఆర్ ఇప్పుడు స‌తీస‌మేతంగా న‌వ‌గ్ర‌హ యాగం నిర్వ‌హించారు. దీనికి సంబంధించిన ఒక వార్త బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ‘నవగ్రహ’ మహా యాగం నిర్వహిస్తున్నారు అనే వార్త బయటకొచ్చింది. వేద పండితుల నడుమ తన సతీమణి శోభతో కలిసి కేసీఆర్ ఈ యాగం మొదలు పెట్టారు. అయితే తీహార్ జైలు నుండి బెయిలు మీద బయటకు వచ్చిన‌ కవిత కూడా ఈ యాగంలో పాల్గొంది.

ఆధ్యాత్మిక భావనలో ఎక్కువగా గడిపే కేసీఆర్ 2015 లో ఛండీ యాగం, 2018, 2023 లో రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే 2023 ఎన్నికల ముందు నిర్వహించిన రాజశ్యామల యాగంతో కేసీఆర్ కు రాజ్యాధికారం దక్కలేదు. పార్టీ ఓటమితో కృంగిన కేసీఆర్ కాలుకు ఫ్రాక్చర్ కావ‌డం, కూతురు కవిత అరెస్టయ్యి జైలుకు వెళ్లడం, పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా గులాబీ పార్టీని వీడ‌టం…. ఇలా అన్ని అపశకునాలే ఎదుర‌య్యాయి.అందుకే నవగ్రహ శాంతి పూజకు కెసీఆర్‌ సిద్ధమైన‌ట్లున్నార‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ పూజ‌తో అయినా కెసీఆర్‌కు కాలం కలిసి వచ్చి మంచి రోజులు మళ్ళీ తిరిగి వస్తాయనే ఆలోచనలో కేసీఆర్ కుటుంబ స‌భ్యులు ఉన్నట్లు ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ నెల 11 నుంచి కేసీఆర్ తన ఫేమ్ హౌస్ ని వీడి ప్రజలలోకి వెళ్ళడానికి కార్యచరణను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో జాతక రీత్యా తనకు ఉన్న అవరోధాలను తొలగించుకోవడానికి శాంతి పూజలను, యాగాలను నిర్వహిస్తున్నారు కేసీఆర్. రాజశ్యామల యాగంతో మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుదామ‌నుకున్న కెసీఆర్ ఆ ప్లాన్ వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా అవ‌రోధాల‌ను అధిగ‌మించి స‌క్సెస్ కాడానికి ఈ నవగ్రహ మహాయాగం చేస్తున్నార‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. పోనీలే ఈ యాగంతో అయినా కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు ట‌చ్‌లోకి వ‌స్తున్నార‌ని జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version