టిడిపిలో నెంబర్ టూ గా ఉన్న ఆ నేతకు ఈసారి టికెట్ ఉంటుందా..?? ఆ టికెట్ కోసం ఓ ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నరన్న టాక్ తెలుగుదేశం పార్టీలో జోరుగా వినిపిస్తోంది.. ఇంతకీ అధినేత చంద్రబాబు వారిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారో చూద్దాం..
వై నాట్ 175 అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగానే మార్పులు చేర్పులు చేస్తుంది.. కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను సైతం మార్చింది.. దీంతో ప్రతిపక్ష టిడిపిలో గుబులు మొదలైంది.. సర్వేలు సమాలోచనలు చేసిన టిడిపి అధినాయకత్వం.. కొందరు ముఖ్య నేతలకు మొండి చెయ్యి చూపే దిశగా పావులు కదుపుతోంది.. విజయనగరం జిల్లాలో టిడిపికి పెద్దదిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజు సీటుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎసరు పెడుతున్నారనే టాక్ పార్టీలో నడుస్తుంది..
విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంట శ్రీనివాసరావు గత కొద్దికాలంగా టిడిపికి దూరంగా ఉంటున్నారు.. అయితే ఆయన విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారం చేస్తున్నది గంటాకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన అనుచరులే.. అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా ఉన్న కాపు నేతలు అందరూ గంటా శ్రీనివాసరావుని విజయనగరం ఎంపీగా పోటీ చేయించాలని ట్రై చేస్తున్నారట.. అశోక్ గజపతి రాజుకి వయసు అయిపోవడం, పార్టీలో క్రియాశీలకంగా లేకపోవడంతో.. గంటాను విజయనగరం జిల్లాకు తీసుకురావాలని చూస్తున్నారట..
విజయనగరం జిల్లాలో ఉండే కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు.. అశోక్ గజపతిరాజు ప్రాబల్యాన్ని తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు.. గత మహానాడు సమయంలో కాపు నేతగా ఉన్న కళా వెంకట్రావుకి అశోక్ గజపతి రాజుకి మధ్య విభేదాలు బయటపడ్డాయట.. దీంతో కాపు నేతలు అందరూ సమావేశమై అశోక్ గజపతిరాజుకి టికెట్ రాకుండా చేయాలని తీర్మానం చేసుకున్నారట.. అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజు కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారంపై కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నారట.. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అతిథి గజపతిరాజుకి చంద్రబాబు టిక్కెట్ ఎలా ఇస్తారో చూస్తామంటూ కాపు నేతలు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి..
ఓడిపోయిన వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారు..?
2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె అతిథి గజపతిరాజు ఇద్దరూ ఓటమిపాలయ్యారు.. అప్పటినుంచి తండ్రీ కూతుర్లిద్దరూ అడపాదడపా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారే తప్ప.. కార్యకర్తలకి అందుబాటులో ఉండడం లేదని ఆయన అసమ్మతి వర్గం ప్రచారం చేస్తుంది.. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మీసాల గీతా సైతం గజపతిరాజు ఫ్యామిలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది.. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో గజపతిరాజు కుటుంబం ఒక్క ఆందోళన కూడా చేయలేదని.. మరి అలాంటి వారికి టిడిపి టికెట్ ఎలా ఇస్తుందని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో తండ్రి కూతుర్లు ఇద్దరికీ చెక్ పెట్టేందుకు విజయనగరంలోని అసమ్మతి నేతలు అందరూ ఏకమయ్యారట.. ఎంపీగా గంటా శ్రీనివాసరావుని తెరపైకి తీసుకు వచ్చారనే ప్రచారం జరుగుతుంది.. గంటా శ్రీనివాసరావు విజయనగరంలో పోటీ చేస్తే కాపు ఓటర్లందరూ టిడిపికి అనుకూలంగా ఓటు వేస్తారని గంట వర్గీయులు చెబుతున్నారు.. ఇంతకీ చంద్రబాబు మధ్యలో ఏముందో గాని .. విజయనగరం ఎంపీగా పోటీ చేసేందుకు గంటా మాత్రం ఆసక్తి చూపుతున్నారు.