తొలి జాబితా అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలుగుదేశం, జనసేన పార్టీల్లో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. సీనియర్ల నుంచి జూనియర్ల దాకా టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు.తాజాగా రాజోలు టికెట్ ఆశించి భంగపడిన మాజీమంత్రి, సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ అధినేత వైఖరి పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ రాజీనామా లేఖ సమర్పించారు.ఇప్పటికే ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఫ్లెక్సీలు, జెండాలను కూడా అనుచరులు తొలగించారు. గొల్లపల్లి త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీలోనూ రాజోలు టికెట్ ఆయనకు దక్కే అవకాశాలు లేవు.
గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. తరువాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు.ఆయన 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వర్ రావుపై 4,683 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. తర్వాత రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇటీవల టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. సీనియర్ అయిన తనకు తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు.దీంతో అధినేత వైఖరిని ఖండిస్తూ టీడీపీలోని తన పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు.గౌరవం లేని చోట ఉండలేనని లేఖలో పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో రాజోలు టీడీపీ టికెట్ గొల్లపల్లికి దక్కేలా లేదు. తన కూతురికి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. అది కూడా సాధ్యపడకపోవచ్చంటూ టీడీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.వైసీపీలోకి వస్తే అమలాపురం లోక్‌సభ టికెట్‌ను గొల్లపల్లికి కేటాయిస్తారని సమాచారం. ఈ ఆఫర్ తోనే ఆయన వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారని చెబుతున్నారు.