యువ నేతలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పేదేముంది. గెలిచిన వారు.. గత ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా పోటీ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే, వీరంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? సాధారణ ప్రజల మాదిరిగానే వీరు కూడా ఇంటికే పరిమితమయ్యారా ? లేక ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి తమవంతు సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారా ? అనే ప్రశ్నలు వస్తే.. ఆసక్తికర విషయాలే ఏపీ రాజకీయాల్లో మనకు కనిపిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు ప్రజలకు ఎవరు ఏ సాయం చేసినా.. పదికాలాలు గుర్తుంచుకునే కరోనా కాలం. పట్టెడన్నం పెట్టినా.. పది రూపాయలు డబ్బులు ఇచ్చినా.. వారు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. గత నెల రోజులుగా పనులు లేకుండా ఇంటికే పరిమితమయ్యారు జనాలు.
దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ.. మన దగ్గర మరీ డిఫరెంట్. రాష్ట్రం కూడా ఆదుకునే పరిస్థితిలో లేదు. ఉన్నదేదో పేదలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 సాయం చేసింది. ఉప్పు, పప్పు, బియ్యం వంటివి కూడా రేషన్ కార్డున్నవారికి అందాయి. అయితే, రేషన్ కార్డులేని అనేక మంది కోట్లలో పేదలు ఉన్నమాట వాస్తవం. మరి వారి పరిస్థితి ఏంటి ? వారికి సాయం ఎవరు చేస్తారు ? అదే సమయంలో యువత కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో యువ నాయకులు ఇంటికే పరిమితం కావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.
గత ఏడాది ఎన్నికల సమయంలో పోటీ పడి మరీ టికెట్లు తెచ్చుకుని ప్రతిష్టాత్మకంగా పోటీ చేసిన నాయకులు ఇప్పుడు ప్రజలు కష్టకాలంలో ఉంటే పట్టించుకుంటున్న దాఖలా ఎక్కడా ఏ పార్టీ నుంచి కూడా కనిపించడం లేదు. అదే సమయంలో గత ఏడాది పోటీ చేసిన యువ నేతలు ఏమీ కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన వారేమీకారు. వారి తండ్రులు, తల్లులు రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నవారే. మంచి మంచి పదవులు అనుభవించి ఎంతో కొంత గడించిన వారే. ఈ సమయంలో వాటి నుంచి పేదలకు, యువతకు ఏదో ఒక రూపంలో సాయం చేయడం ద్వారా రాజకీయంగా తమకు మంచి బాటలు వేసుకునేందుకు చక్కని అవకాశం ఏర్పడింది.
అయితే, ఈ విషయాన్ని చాలా మంది గుర్తించడం లేదు. కరోనా సమయం వెయ్యి రూపాయలు ఇచ్చినా.. అది పది వేలతో సమానం. ఈ సాయం కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ సమయంలో సాయం చేసేందుకు యువ నేతలు ముందుకుకదిలితే.. బాగుంటుందనే సూచనలు వెలువడుతున్నాయి. మరి మన యువ నేతలు ముందుకు కదులుతారా? లేదా? చూడాలి.