కేసీఆర్ మౌనం….దేనికి సంకేతం..?లోక్ సభ అభ్యర్థులపై కసరత్తు లేనట్లేనా..!

-

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీ ఖరారైపోయింది. ఏపీ సహా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొదటి విడతలోనే జరుగుతుందని సంకేతాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై కసరత్తు చేస్తూ ఇప్పటికే కొందరిని ఖరారు చేసింది.అటు బీజేపీ నేతలు కూడా పాదయాత్రలు చేస్తూ ఎన్నికల హడావుడి తెచ్చేశారు. అయితే భారత రాష్ట్ర సమితి లో నిర్లిప్తత నెలకొనడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అభ్యర్థుల ఎంపిక,ఎన్నికల వ్యూహంపై అసలు ఎలాంటి కసరత్తు చేయడం లేదు.కీలకమైన సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం కాగా కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. మరో కీలకనేత హారీష్ రావు కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రకటన కూడా చేయడం లేదు. దీంతో అసలు బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ అభ్యర్థులను నిలబెడుతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఇటీవల కృష్ణా జలాల హక్కుల సాధనపై నల్గొండలో బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది అనే సంకేతాలు ఇచ్చారు.ఆ తర్వాత వరుస కార్యక్రమాలు పెడతారని కూడా అంతా అనుకున్నారు.కానీ మళ్లీ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ అని కేటీఆర్, హరీష్ పాదయాత్ర అని పార్టీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి కానీ దానికి సంబంధించి కార్యాచరణ కనిపించడం లేదు.ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వస్తే పాదయాత్రలకు అవకాశం ఉండదు.

అయినప్పటికీ బీఆర్ఎస్లో మాత్రo ఉలుకూ పలుకూ లేకుండా పోయింది. బీజేపీతో పొత్తు కోసం బీఆరెస్ ప్రయత్నం చేస్తున్నా కమలం పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు.పైగా బీఆర్ఎస్ తో పొత్తు అంటే లోకల్ బీజేపీ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ససేమిరా అంటున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని చర్చలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, వాటిని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది.మహబూబ్ నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అంటూ సీఎం రేవంత్ ప్రకటన కూడా చేశారు. అటు పార్లమెంటు స్థానాలవారీగా కాంగ్రెస్ నాయకత్వం మంత్రులకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 స్థానాలకుగాను కనీసం 14 స్థానాలను దక్కించుకోవాలని పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది.

అలాగే బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న విజయం దక్కకపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా ముమ్మరం చేస్తూ విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయ సంకల్ప యాత్రల ద్వారా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆరెస్‌తోపాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉంటోంది.ఈ మౌనం ఎంతవరకు ఉంటుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version