సోయి తప్పి.. స్థాయి మరిచి ప్రేలాపనలు.. అన్న చిరంజీవిపైనే విమర్శలు

-

ఏరు దాటేదాక ఓడ మ‌ల్ల‌న్న‌, ఏరు దాటాక బోడి మ‌ల్ల‌న్న అన్న‌ట్లుంది జ‌న‌సేన వ్య‌వ‌హారం. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికే తాడూ బొంగరం లేదు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి అడ్రస్ చెబితే తప్ప తనకు సినిమాల్లోకి ఎంట్రీ లేదు. అయితే ఇప్పుడు పవన్ అభిమానులు అన్న చిరంజీవినే ప్రశ్నించే స్థాయికి చేరారు.

ఊగిపోతూ చేసే ప్రసంగాలు చేసే పవన్ రోజుకో మాట మారుస్తూ ఉండటాన్ని గమనిస్తూనే ఉన్నాం. పవ‌న్ మాట‌లు ఒక రోజుకి ఇంకో రోజుకి సంబంధం లేకుండా ఉంటున్నాయి. ఇలా ఆయన ఎన్నిరోజులు ప్రజల్లో ఉన్నా ఆయన్ను సినిమా హీరోగా తప్ప నాయకుడిగా చూడలేని పరిస్థితి. 175 నియోజ‌క వ‌ర్గాల్లో పోటీ చేయ‌లేని ద‌య‌నీయ ప‌రిస్థితిలో జ‌నసేన ఉందంటే కార‌ణం ఎవ‌రు? అస‌లు ఎవ‌రి కోసం రాజ‌కీయం చేస్తున్నాడో కూడా అర్థం కాని ప‌రిస్థితి. పార్టీ పెట్టి రెండుచోట్లా ఓడిపోయిన రికార్డ్ మూటగట్టుకున్నాడు.

ఇదే విషయాన్ని ఆయన ఒప్పుకుంటు తనను చూడ్డానికి జనాలు వస్తున్నారు తప్ప ఓట్లు వేయడం లేదని నిష్టూరమాడారు. అయితే ఓట్లు వేయడానికి.. నాయకుడిగా గుర్తించడానికి ప్రజలు కొన్ని అర్హతలు నిర్ణయిస్తారు. అవేమి పవన్ కళ్యాణ్‌లో లేకపోవడంతో ఆయన్ను తిరస్కరించారు అనేది వాస్తవం. దీన్ని జీర్ణించుకోలేని పవన్ అభిమానులు, ఇప్పుడు ఏకంగా చిరంజీవిని టార్గెట్ చేసి నిందించడం మొదలెట్టేశారు.

పవన్ కళ్యాణ్‌ను ప్రజలు నమ్మకపోవడానికి, ఆయన్ను అసలు సీరియస్ నాయకుడిగా చూడకపోవడానికి కార‌ణం చిరంజీవేన‌ట‌. ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వ‌ల్లే జ‌న‌సేన, ప‌వ‌న్ ప‌రిస్థితి ఇలా ఉంద‌ని సోషల్ మీడియాలో రాయపాటి అరుణ అనే వీర మహిళ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వివాదాస్పదమ‌య్యాయి. చిరంజీవి నిర్ణయంతో ఇప్పుడు తమ పవన్ కళ్యాణ్‌ను ఎవరూ నమ్మడం లేదని, చిరంజీవి ఆనాడు పార్టీని విలీనము చేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉంటే తాము ఇప్పుడు బాధ పడుతున్నాం అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త వివాదానికి తెర లేపాయి.

అయితే చిరంజీవి ప్రోత్సాహం లేకుంటే ప‌వ‌న్ సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చేవాడా?? తండ్రి త‌రువాత తండ్రిలా అన్నీ చూసుకున్నారు చిరంజీవి. పవన్ కి చిరు చేసిన మేలు మరిచినటున్నారు జనసైనికులు. ఇప్పుడు రోజుకు 2కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌దీ చిరు చ‌ల‌వే అనే విష‌యాన్ని విస్మ‌రిస్తున్నారు. చిరు వేసిన బాట‌లోనే క‌దా ఈ స్థాయికి ఎదిగింది అంటూ చిరు అభిమానులు సైతం రిప్లై ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ తగాదా ముదిరి ఇద్దరి ఫ్యాన్స్ ఇలా మాటలు విసురుకోవడంతో నాగబాబు లైన్లోకి వచ్చి.. లీవిట్.. వదిలేయండమ్మా… ఆమె తెలిసీ తెలీకుండా ఫ్లో‌లో అలా అనేసింది పట్టించుకోకండి అని శాంతపర్చారు. తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేస్తే చేసారు కానీ.. పవన్ అసమర్థతకు… చంద్రబాబు దగ్గర సరెండర్ అయి ఉండడానికి చిరంజీవికి ఏం సంబంధం? అని చిరు అభిమానులు గుర్రుమంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version