ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే ఆ రాజకీయం ఇప్పుడు తెలంగాణలో కూడా నడుస్తుంది. అదే సమయంలో ఒకే పార్టీలో కూడా ఈ కుల రాజకీయం ఉంది. ఒక కులం పెత్తనం ఎక్కువ ఉందని మరొక కులం దెబ్బతీయాలని చూడటం..తమ హవా నడవాలని మరొక కులం ప్రయత్నించటం సాధారణంగా జరిగిపోతుంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బిఆర్‌ఎస్ పార్టీలో కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్లు పోరు నడుస్తుంది.
వాస్తవానికి ఇక్కడ తెలంగాణతో పాటు ఏపీ నుంచి వచ్చిన సెటిల్ అయిన వారు ఎక్కువ. వారిలో అన్నీ కులాల వారు ఉన్నారు. అయితే రాజకీయంగా కమ్మ, రెడ్ల ఆధిపత్యం కనిపిస్తుంది. గతంలో కమ్మ టిడిపి..రెడ్డి కాంగ్రెస్ అన్నట్లు పోరు నడిచేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కమ్మ నేతలు దాదాపు బిఆర్‌ఎస్ లోకి వచ్చేశారు. అంటే అందులో మినీ టిడిపి అన్నట్లు. ఇటు రెడ్డి నేతలు కొందరు కాంగ్రెస్ లోనే ఉంటే..కొందరు బిఆర్‌ఎస్ లోకి వచ్చారు.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ బిఆర్‌ఎస్ లో కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్లు పోరు నడుస్తుంది. ఇక్కడ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కమ్మ వర్గం..అక్కడే బిఆర్‌ఎస్ లో శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన గతంలో బిజేపిలో పనిచేశారు. తర్వాత బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇక మాగంటి..2014లో టిడిపి నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2018లో మళ్ళీ గెలిచారు.
అయితే ఈ సారి మాగంటికి పోటీగా శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో అక్కడ కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్లు పోరు నడుస్తుంది. రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతున్న ఆంధ్రా వాళ్ళ హడావిడి పోవడం లేదని శ్రీధర్ వర్గం కామెంట్లు చేస్తుంది. ఇక గ్రేటర్ లో తమ వర్గం వల్ల బిఆర్‌ఎస్ నిలబడిందని కమ్మ వర్గం అంటుందట. ఇలా ఇద్దరు నేతల మధ్య వార్ రెండు వర్గాలుగా మారింది. దీనికి త్వరగా చెక్ పెట్టకపోతే బిఆర్‌ఎస్ పార్టీకే నష్టం.