చీఫ్ విప్ గా మల్‌రెడ్డి రంగారెడ్డి… నేడో రేపో రానున్న ఉత్తర్వులు

-

తెలంగాణ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వేగంగా తన టీమ్ ని సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీలో సీనియర్లు అయిన 11 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. అలాగే మరో సీనియర్ గడ్డం ప్రసాద్ ని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలకు ఉద్వాసన పలికారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నేతలకే అన్ని రకాల పదవులను కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన పదవులను కట్టబెడుతున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ప్రభుత్వ విప్ లుగా నలుగురుని ఇప్పటికే ఖరారు చేశారు. కేబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్ నియామకంపై కూడా సీఎం రేవంత్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని ప్రభుత్వం చీఫ్ విప్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ లో మల్ రెడ్డి రంగారెడ్డి క్రియాశీలకమైన నేత. ఆయన రాజకీయ ప్రస్థానం ఓసారి పరిశీలిస్తే 1981లో తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారాయన. 1981లో తోరూర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1986లో హైదరాబాద్ డీసీబీబి డైరెక్టర్‌గా పని చేశారు.1994లో మలక్ పేట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2023 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కీలకమైన లీడర్లందరితోనూ రంగారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతం బాధ్యతలు ఆయనకు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు రెడ్లు కేబినెట్ లో ఉన్న దృష్ట్యా రంగారెడ్డికి చీఫ్ విప్ పదవి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలకా ప్రకటన నేడో రేపో ప్రభుత్వం నుంచి రానుంది.

పార్లమెంట్ ఎన్నికల లోపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పుంజుకునే దిశగా అడుగులు వేస్తోంది.ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మిగతా అన్ని చోట్ల ఆ పార్టీ ఓటమిని మూట గట్టుకుంది. దీంతో ఇప్పుడు గ్రేటర్ పరిధిలో పార్టీ పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

పార్లమెంట్ ఎన్నికల లోపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ జెండా రెపరేపలాడాన్నదే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి రంగారెడ్డి అయితే మంచి ఫలితాలు వస్తాయని అంచనాలు వేస్తోంది.అందుకే రంగారెడ్డి కి కేబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్ పదవిని కట్టబెట్టేందుకు సీఎం డిసైడ్ ఆయినట్లు తెలుస్తోంది. తొలుత ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. అటు పార్టీలోనూ ఇదే ప్రచారం జరిగింది. అయితే వివిధ సమీకరణాల దృష్ట్యా కేబినెట్ ర్యాంక్‌తో కూడిన చీఫ్​విప్ పదవిని ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, అంబర్ పేట్, కుత్బుల్లాపూర్,జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ , ముషీరాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్, ఉప్పల్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, మేడ్చల్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పార్టీ బలం పెంచేందుకు హై కమాండ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version