రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి జరుగుతోందని చెప్పిన మంత్రి రోజా పొలిటికల్ బ్రోకర్స్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పవన్, లోకేష్ లు ఏ ముఖం పెట్టుకుని యాత్రలు చేస్తారని ప్రశ్నించారు. యువతకు ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. విజయవాడ భవాని ఐలాండ్లో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో రోజా పాల్గొని సందడి చేశారు. బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి వెళ్లే ప్రసక్తే లేదని మంత్రి ఆర్కే రోజా తేల్చిచెప్పారు. గతంలో రెండుసార్లు పిలిచినప్పుడు వెళ్లడం కుదరలేదని.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎపిసోడ్లో తర్వాత అన్పబుల్ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని మంత్రి రోజా పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్ర చేసినా, పవన్ వారాహి అంటూ వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు.
వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి ముగింపు వేడుకల్లో రోజా పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. భవానీ ద్వీపంలో సంక్రాంతి సంబరాలు బాగా జరిగాయి. ఏపీ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాం. టెంపుల్ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాం. నదీతీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. పబ్లిక్-ప్రైవేటు విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం’ అని పేర్కొన్నారు.