విశాఖకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. విశాఖలో 41 లక్షల జనాభా నివసిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 76.9కి.మీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సమర్పించిందని గుర్తు చేశారు. రానున్న బడ్జెట్లో మెట్రో రైలుతో పాటు, విశాఖపట్నం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్కు విజయసాయిరెడ్డి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు పలు బడ్జెట్లు ప్రవేశపెట్టానని, ఏ బడ్జెట్ లోనూ మధ్యతరగతి వారిపై పన్నులు వేయలేదని స్పష్టం చేశారు. మధ్యతరగతి ప్రజల కష్టాలు తనకు తెలుసని, తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని ఆమె వెల్లడించారు.
మధ్యతరగతి వారిని మరింత సమస్యలకు గురిచేసేలా పన్నులు వేయలేదని, వారికి మరిన్ని సేవలు అందిస్తామని వివరించారు. ఇకపైనా తమ ప్రభుత్వం మధ్యతరగతి వర్గం అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని అన్నారు. అంతేకాదు, మధ్యతరగతి ప్రజలు భారీ ఎత్తున నగరాలకు వలస వెళుతున్న నేపథ్యంలో దేశంలో స్మార్ట్ సిటీల అభివృద్ధిపై దృష్టి పెట్టామని తెలిపారు.