ప్రస్తుతం ఏపీలో పొత్తుల చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల తేదీ దగ్గరయ్యే కొద్దీ అన్ని పార్టీలు యాక్టివ్ అవుతున్నాయి. సీఎం జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ- జనసేన కూటమి నెమ్మదిగానే ట్రాక్ లోకి వస్తోంది. ఇక షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివ్ మోడ్ లోకి వచ్చింది. అంతేకాదు ఆయా పార్టీల సీనియర్లు తెరముందుకు వచ్చి సలహాలతో పార్టీలను క్రియాశీలకంగా మారుస్తున్నారు. ఏపీలో ఇంత జరుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆయన ఏమయ్యారు…? ఏ పార్టీలో ఉన్నా అజ్ఞాతంలోనే ఉంటారా అని చర్చలు నడుస్తున్నాయి. ఏపీలో ఎన్నికల వేడి పెరిగిన సమయమంలో కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ విభజన తరువాత సొంత పార్టీ పెట్టి సమైక్యవాదంతో ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎవ్వరూ గెలవలేదు. ఆ తరువాత కిరణ్ కుమార్రెడ్డి చాలా రోజులు సైలెంట్ అయ్యారు. కొన్నాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో చేరినా అంటీముట్టనట్టు వ్యవహరించారు. అక్కడ ఉండలేక కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో కూడా ఆయన యాక్టివ్గా కనిపించడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కనిపించినట్టే కనిపించి కనుమరుగయ్యారు. ఇటీవల ఎక్కడ మీటింగ్లు ఉన్నా హాజరుకావడం లేదు. మళ్లీ ఏపీలో ఎన్నికలు వస్తున్నా ఆయన ఎక్కడా కనిపించడంలేదు.
తెలంగాణ ఎన్నికల సమయంలో తెర వెనుక పాత్ర పోషించే ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఆయన రాజకీయాల్లో కనిపించడం మానేశారు. ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో అసలు పాల్గొనడం లేదు. పార్టీలో చేరినప్పుడు ఏపీకి వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి కనిపించి వెళ్లిపోయారు. తర్వాత బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి బాధ్యతలను చేపట్టే సమయంలో కనిపించారు. ఇక అంతే ఆయన అడ్రస్ లేదు. నెల్లూరు ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారంటూ ఆ మధ్య బీజేపీ నేతలు కాస్త హడావుడి చేశారు. పార్లమెంట్ పరిధిలో సొంత టీమ్ పెట్టి సర్వే కూడా జరిపారు. కొన్ని రోజులకే ఈ టాపిక్ ఆగిపోయింది. ఎన్నికల వేళ పోటీ చేస్తామంటూ ఎవరెవరో టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పేరు మాత్రం అసలు ప్రచారంలోకి రావడం లేదు. దీంతో ఏ పార్టీలో చేరినా సైలెంట్ మోడ్ లోనే ఉంటారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.