ఏపీలో అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో కూడా అంతర్గత పోరు ఎక్కువగానే ఉంది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా నెల్లూరులో టిడిపిలో మొదట నుంచి రచ్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ కొంతమంది నేతలు అధికార వైసీపీ నేతలతో కుమ్మక్కు అవ్వడం సొంత పార్టీకి డ్యామేజ్ చేయడం జరుగుతూ వస్తుంది. ఇక ఇటీవల నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి వైపుకు వస్తుండటంతో రచ్చ మరింత ముదిరింది.
అయితే కోటంరెడ్డికి ఎమ్మెల్యే పదవి ఉండటంతో ఆయన్ని ఇప్పుడే చేర్చుకోకుండా..ఎన్నికల ముందు చేర్చుకోవాలని చంద్రబాబు భావించి..కోటంరెడ్డిని ఇండిపెండెంట్ గా పోరాటం చేయాలని సూచించారు. ఇపుడు ఆ దిశగానే కోటంరెడ్డి పోరాడుతున్నారు. కాకపోతే ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిని మాత్రం టిడిపిలో జాయిన్ చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య గిరిధర్ రెడ్డి బాబు సమక్షంలో టిడిపిలో చేరారు.
అయితే టిడిపిలోకి వచ్చిన గిరిధర్ రెడ్డికి..నెల్లూరులోని ఇతర టిడిపి నేతల నుంచి సరైన మద్ధతు లేదు. ఆయన్ని కలుపుకోవడం లేదు. ఏమైనా పార్టీ కార్యక్రమాలు ఉంటే గిరిధర్ రెడ్డికి ఆహ్వానం ఇవ్వడం లేదు. దీంతో గిరిధర్ కూడా సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలని చేస్తున్నారు. దీని వల్ల పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. అయితే చంద్రబాబు అందరూ కలిసి పనిచేయాలని సూచించిన సరే నెల్లూరు తమ్ముళ్ళు ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు.
పైగా ఎమ్మెల్యే కోటంరెడ్డిని టిడిపిలో చేరనివ్వకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం కోటంరెడ్డిని టిడిపిలో చేర్చుకోవడం ఖాయమైంది..అలాగే ఆయనకు నెల్లూరు రూరల్ సీటు ఇవ్వడం ఖాయమనే చెప్పాలి. అయితే టిడిపి నేతలంతా కలిసి పనిచేసేలా బాబు ప్లాన్ చేస్తే..నెల్లూరులో పార్టీ పరిస్తితి ఇంకా బాగుంటుంది