కొత్త చరిత్ర: ముర్ము..ఆ ముద్ర తొలగిస్తారా?

-

అవును ఓ గిరిజన మహిళ..రాష్ట్రపతి పీఠం దక్కించుకోవడం కొత్త చరిత్ర అనే చెప్పాలి..భారతదేశ చరిత్రలో ఎన్నడూ..ఓ గిరిజన మహిళ అత్యున్నత పదవి పొందలేదు..కానీ తొలిసారి దేశ ప్రథమ పౌరురాలుగా ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎన్డీయే పక్షాలు బలపర్చిన ముర్ము…రాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం సాధించి..దేశంలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. దేశంలో ఎంతటి చిన్న స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించిన వారైనా…అత్యున్నత స్థానానికి వెళ్లగలరని మరోసారి రుజువైంది.

ఒడిశా రాష్ట్రానికి చెందిన ముర్ము…ఓ గిరిజన పేద కుటుంబంలో పుట్టి, పెరిగి ఉన్నత చదువులు చదివి…టీచర్ గా జీవితాన్ని ప్రారంభించి..అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కౌన్సిలర్ గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా…అలాగే జార్ఖండ్ రాష్ట్రం తొలి మహిళా గవర్నర్ గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా సేవలందించారు.

అయితే అనూహ్యంగా బీజేపీ పెద్దల సపోర్ట్ తో రాష్ట్రపతి రేసులోకి వచ్చారు. అలాగే ఊహించని విధంగా అద్భుతమైన మెజారిటీతో గెలిచి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించారు. ఇలా సరికొత్త చరిత్ర సృష్టించి రాష్ట్రపతి అయిన ముర్ము…యథావిధిగానే రబ్బరు స్టాంపుగా ఉండిపోతారా? లేక సరికొత్త పంథాలో ముందుకెళ్తారా? అనేది అందరూ ఆసక్తికరంగా గమనిస్తున్నారు. రాష్ట్రపతి అంటే అధికార పార్టీ చేతిలో రబ్బరు స్టాంపు అనే ముద్ర ఉంది.

ప్రతిపక్షాలు ఎప్పుడు ఇదే తరహాలో విమర్శిస్తాయి…ఎవరు అధికారంలో ఉంటే…వారి మాటని రాష్ట్రపతి వింటారని, జాతికి మేలు చేయని నిర్ణయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే…వాటిని వ్యతిరేకించకుండా ఉంటారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు అదే తరహాలో కామెంట్లు చేస్తున్నాయి…ముర్ము రబ్బరు స్టాంపుగా ఉండకూడదని కోరుకుంటున్నారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా సైతం…ముర్ము రబ్బరు స్టాంపుగా ఉండనని ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అంటే ఏ విధంగా రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు అనే ముద్ర ఉందో అందరికీ తెలిసిందే. మరి ఆ ముద్రని ముర్ము తొలగించి.. స్వయం నిర్ణయాధికారాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా.. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారు. ఏదేమైనా ముర్ము…రబ్బర్ స్టాంప్ ముద్ర తొలగిపోయేలా, రాష్ట్రపతి స్థానానికి గౌరవం పెరిగేలా ముందుకెళ్తారని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version