ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాలను తీవ్ర స్థాయిలో వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రపంచదేశాలు వ్యాపించి అటు ప్రజలకు.. ఇటు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షా 50 వేలు దాటింది. మరియు 20 లక్షలకుపైగా కరోనా సోకి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇలా కరోనా వైరస్ తీవ్రత నాటినికీ పెరుగుతోంది తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంలేదు. అయితే ఇప్పటికే కరోనాను కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
అందులో భారత్ కూడా ఒకటి. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ పనులు లేక ఇళ్లకే పరిమితమైన పేదప్రజలు జానెడు పొట్ట నింపుకునేందుకు నానా అవస్తలు పడుతున్నారు. కొన్ని సార్లు పస్తులు కూడా ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఎవరో ఒకరు సహాయం చేయకపోరా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేదవారిని ఆదుకునేందుకు ముందడుగు వేశారు.
ఈ నెల 19న ఈయన బర్త్‌డే సందర్భంగా 10వేల నిత్యావసర సరుకుల కిట్స్, 10వేల హ్యాండ్ శానిటైజర్లు, 3 రకాల కూరగాయలు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10 వేల మంది నిరుపేదలకు అందజేయనున్నట్టు తాజాగా వెల్లడించారు. అలాగే సామాజిక దూరం పాటిస్తూ రెవెన్యూ శాఖ ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. ఇక పది వేల కిట్స్ ను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతికి అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా లాక్‌డౌన్ టైమ్ పువ్వాడ తన మంచి మనసును చాటుకున్నారు.