రేవంత్ రెడ్డి ఎఫెక్ట్: ఆ జిల్లాలో మళ్ళీ కారుకు షాక్ తప్పదా!

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్‌గా ఉందనే సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి బలం ఉంది. కాకపోతే మొన్నటివరకు ప్రతిపక్షాలు వీక్‌గా ఉండటంతోనే టీఆర్ఎస్ హవా కొనసాగిందని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు పుంజుకున్నాయని, కాబట్టి టీఆర్ఎస్‌ హవాకు కాస్త గండిపడే అవకాశాలున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

దీని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు పెద్దగా అనుకూలమైన పరిస్తితులు ఉండకపోవచ్చని, బీజేపీ-కాంగ్రెస్‌లు టఫ్ ఫైట్ ఇస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్‌కు మళ్ళీ షాక్ తగిలే అవకాశం లేకపోలేదని అంటున్నారు. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చిందిగానీ, ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ పార్టీ సత్తా చాటలేకపోతుంది.

2014 ఎన్నికలు కావొచ్చు, 2018 ఎన్నికలు కావొచ్చు ఖమ్మంలో కాంగ్రెస్ హవానే నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తనవైపుకు లాక్కున్నా సరే పెద్ద ప్రయోజనం ఉండటం లేదనే చెప్పొచ్చు. 2018లో జిల్లాలో కాంగ్రెస్-టీడీపీల హవా నడిచింది. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఖమ్మంలో ఉన్న పది సీట్లలో 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 6 చోట్ల గెలవగా, టీడీపీ రెండు చోట్ల గెలిచింది. ఒకచోట ఇండిపెండెంట్ గెలవగా, కేవలం ఖమ్మం అసెంబ్లీలో టీఆర్ఎస్ తరుపున పువ్వాడ అజయ్ గెలిచారు.

అయితే కాంగ్రెస్ తరుపున గెలిచిన నలుగురు, టీడీపీలో గెలిచిన ఇద్దరు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. దీంతో ఖమ్మంలో టీఆర్ఎస్ బలం పెరిగింది. కాకపోతే ఎమ్మెల్యేలు అయితే వచ్చారుగానీ, క్యాడర్ మాత్రం వెళ్లలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పైగా రేవంత్ రెడ్డి పీసీసీ కావడంతో జిల్లాలో పార్టీకి మరింత ఊపు వచ్చిందని, నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్‌కే మెజారిటీ వస్తుందని చెబుతున్నారు.

ఇదే సమయంలో ఇక్కడ టీడీపీ క్యాడర్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ వీక్ అవ్వడంతో వారు రేవంత్ రెడ్డికి మద్ధతు ఇస్తారని తెలుస్తోంది. ఏదేమైనా గానీ నెక్స్ట్ ఎన్నికల్లో ఖమ్మంలో మళ్ళీ కారు పార్టీకి షాక్ ఇస్తామని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version