తుని టీడీపీలో వివాదం..యనమల సోదరుల మధ్య చిచ్చు..!

-

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మొన్నటివరకు ఒకటిగానే ఉన్న యనమల రామకృష్ణుడు ఫ్యామిలీలో సీటు పంచాయితీ మొదలైంది. తుని అంటే యనమలకు కంచుకోట. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు యనమల గెలిచారు. 2009లో ఓడిపోయారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో రామకృష్ణుడు పోటీ చేయకుండా సోదరుడు వరుసయ్యే కృష్ణుడుని బరిలో దించారు. కృష్ణుడు సైతం ఓడిపోయారు. దీంతో ఈ సారి కృష్ణుడుకు సీటు ఇస్తే మళ్ళీ పార్టీ ఓడిపోతుందని ప్రచారం మొదలైంది.

అసలు యనమల ఫ్యామిలీ వల్ల టీడీపీకే పెద్ద నష్టమని, ఆ ఫ్యామిలీ సీటు ఇస్తే మళ్ళీ వైసీపీ నుంచి మంత్రి దాడిశెట్టి రాజా గెలిచేయడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో యనమల ఈ సారి కృష్ణుడుకు కాకుండా తన కుమార్తె దివ్యకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆల్రెడీ చంద్రబాబు వద్ద తన ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు..యనమలపై భగ్గుమంటున్నారు.

నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో ఫోన్ మాట్లాడుతూ..తనకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేయాలని చెప్పి కృష్ణుడు…నాయకులని కోరుతున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఆడియో ఒకటి లీక్ అయింది. అందులో యాదవ సామాజికవర్గంలో 30 వేల ఓట్లు ఉన్నాయని, తాను లేకపోతే ఎవరు చూడరని, యనమల రామకృష్ణుడు కూతురు దివ్య ఇంట్లో ఉంటుందని, తునిలో వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా మళ్ళీ నెగ్గేస్తున్నాడని అందరూ అంటున్నారని, తాను కష్టపడితే యనమల రామకృష్ణ కూతురుకు సీటు ఇస్తారా అని అడగండని, ఊరికి 40 మంది కలిసి వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి..అంటూ కృష్ణుడు నియోజకవర్గ నేతలతో మాట్లాడుతున్నారు. మరి దీనిపై యనమల ఎలా స్పందిస్తారు..అసలు టీడీపీ అధిష్టానం తునిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version