తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు అయింది. గత ప్రభుత్వం హయాంలో ఈ ఫార్ములా రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు సంబంధించి రూ.50 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.
ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు 13(1) A, 13(2)PC Act, 409, 120 B కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఒకవేళ నేరం రుజువు అయితే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చింది ఏసీబీ.