వరుసగా నాలుగు ఎన్నికలు..నాలుగు ఓటములు..అది కూడా గెలుపు ముంగిట వరకు వచ్చి బోల్తా కొట్టడం..ఇది ఒక నియోజకవర్గంలో టిడిపికి అలవాటైన పనిగా మారిపోయింది. ఇందులో మూడుసార్లు తక్కువ మెజారిటీలతోనే ఓడిపోవడం..ఇక ఈ సారి కూడా ఓడిపోతే అక్కడ టిడిపి సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. అలా టిడిపి గెలుపు దగ్గర వరకు వచ్చి బోల్తా కొడుతున్న నియోజకవర్గం ఏదో కాదు..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట స్థానం. 1999 వరకు ఇక్కడ టిడిపి హవా ఉంది.
1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి గెలిచింది. ఇందులో రెండుసార్లు బండారు సత్యానందరావు పోటీ చేసి గెలిచారు. మధ్యలో 1989లో ఓడిపోయింది. ఇక 2004 నుంచి వరుస ఓటములే. 2004 ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ వేవ్ ఉంది..అయినా సరే టిడిపి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయింది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి చిర్ల జగ్గిరెడ్డిపై టిడిపి అభ్యర్ది బండారు సత్యానందరావు పోటీ చేసి కేవలం 2,271 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2009లో చిర్ల కాంగ్రెస్ నుంచి, బండారు ప్రజారాజ్యం, టిడిపి నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం పోటీ చేశారు. అప్పుడు ప్రజారాజ్యం నుంచి బండారు 2,470 ఓట్లతో కాంగ్రెస్ పై గెలిచారు. 2014లో చిర్ల వైసీపీ నుంచి, బండారు టిడిపి నుంచి పోటీ చేశారు. బండారు గెలుపు వరకు వచ్చి 713 ఓట్ల తేడాతో చిర్ల చేతిలో ఓడిపోయారు.
2019 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు. జగన్ గాలి ఉన్నా, జనసేన ఓట్లు చీల్చిన టిడిపి పోటీ ఇచ్చింది. కేవలం 4,038 ఓట్లతో టిడిపి ఓడింది. జనసేనకు 35,853 ఓట్లు పడ్డాయి. ఇక ఈ సారి టిడిపి-జనసేన పొత్తులో పోటీ చేస్తే..కొత్తపేటలో వైసీపీకి ఎండ్ కార్డు పడుతుంది. లేదా టిడిపికి మళ్ళీ ఓటమే.