నిరసనలు,ప్రమాణాలు ఏపీ టీడీపీలో కొత్త జోష్‌ నింపాయా ?

-

ఏపీలో ఏడాదిన్నరగా అధికారపార్టీపై విమర్శలకు పరిమితమైన టీడీపీ నేతలు గేర్‌ మార్చారు. మాటల తూటాలతోపాటు ప్రమాణాలకు సిద్ధమా అని రోడ్డెక్కుతున్నారు. ఇందుకు దేవుడి గుళ్లను వేదికగా చేసుకుని వేడి పుట్టిస్తున్నారు నాయకులు. తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన ఈ వ్యవహారం ఇతర జిల్లాలకు పాకింది. కొన్నిచోట్ల ప్రమాణాలు.. మరికొన్ని చోట్ల దీక్షలతో హోరెత్తిస్తున్నారు. నువ్వొకటంటే నేను రెండంటాను అని తొడకొడుతున్నారు టీడీపీ నాయకులు. పలుచోట్ల నువ్వానేనా అని సాగిన ప్రమాణాలు, సవాళ్లు టీడీపీలో జోష్‌ నింపాయా అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా చర్చగా దారితీశాయి. ఇద్దరు నాయకులు వినాయకుడి దగ్గరకు వెళ్లి ప్రమాణం చేశారు. ఈ ఘటన తర్వాత విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సైతం తనపై వచ్చిన ఆరోపణలకు ప్రమాణాలకు సిద్ధమని ప్రకటించారు. ఈ సవాల్‌కు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ సై అనడంతో రోజంతా హైడ్రామా నడిచింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు లచ్చన్న విగ్రహం రగడ సైతం ఆ ప్రాంతంలో రాజకీయ వేడి రగిలించింది. పల్నాడు పార్టీ సభలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని తొడకొట్టి సవాల్‌ చేయడం టీడీపీలో చర్చకు దారితీసింది.

ఈ వివాదాలలో పార్టీ నేతల స్పందన చంద్రబాబుకు సంతోషం తీసుకొచ్చిందట. ఆయనే స్వయంగా ఆయా నాయకులకు ఫోన్‌ చేసి అభినందించారట. అధికారపార్టీపై ఇదే తరహా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు టీడీపీ అధినేత. ఇంతలో తాడిపత్రి రగడ, పులివెందులలో టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటన వల్ల కూడా స్థానికంగా ఉండే టీడీపీ కేడర్‌ యాక్టివ్‌ అయిందని లెక్కలు వేసుకుంటున్నారట. గత వారం రోజులుగా వివిధ ఘటనల వల్ల ప్రజల అటెన్షన్‌ తీసుకోవడంలో సఫలమైనట్టు టీడీపీ నేతలు భావిస్తున్నారు. వీటిపై మీడియాలోనూ.. సోషల్‌ మీడియా వేదికగానూ బాగానే కవరేజ్‌ వచ్చిందని సంబర పడుతున్నారట.

అయితే ఈ కవరేజ్‌ వల్ల పార్టీకి మైలేజ్‌ వచ్చిందా లేదా అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. దీనిపై ఎవరి అభిప్రాయం వారిదే. ఈ సవాళ్ల పర్వంలో వ్యక్తిగత అంశాలే ఎక్కువ ఉన్నాయని.. ప్రజలకు చెందిన ఇతర అంశాలపై రచ్చ జరిగి ఉంటే పార్టీకి మైలేజ్‌ వచ్చేదని కొందరి వాదన. ప్రజల అటెన్షన్‌ ద్వారా కవరేజ్‌ మాత్రమే వచ్చిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రమాణాలను, సవాళ్లను ఉపయోగం లేని వ్యవహారంగా కొట్టి పారయేలేమన్నది టీడీపీలోని ఇంకొందరి వాదన. చాలా ప్రాంతాల్లో కేసులు, ఇతరత్రా భయంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కడం లేదు. అలాంటి వారికి కూడా ఈ ఆందోళనలు కొంత ధైర్యాన్ని ఇస్తాయని అనుకుంటున్నారట.

ఈ కార్యక్రమాల వల్ల ఇప్పటికిప్పుడు పెద్ద ప్రయోజనం లేకపోయినా .. ఇతర ప్రాంతాల్లో సైతం నేతలు, కార్యకర్తలు యాక్టివ్ అవ్వడానికి ఉపయోగ పడతాయన్నది పార్టీ పెద్దల అంచనా. మరి.. ప్రమాణాలు పార్టీకి ఏ మేరకు అక్కరకు వస్తాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version