రాజకీయ సంచలనాలకు వేదికగా ఉన్న విజయవాడలో టీడీపీ తన సత్తా నిరూపించేందుకు మళ్లీ రెడీ అవుతోంది. గత ఎన్నికల్లో ఒకింత వెనుకబడినా.. ఇప్పుడు అడుగులు వడివడిగా వేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ నేతలకు చేసిన దిశానిర్దేశం బాగానే పనికి వచ్చేలా కనిపిస్తోంది. గత మార్చిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్‌ను చేజిక్కించుకునేందుకు పార్టీ బాగానే కష్టపడింది. ఏకంగా చంద్రబాబు రంగంలోకి దిగి.. ప్రచారం చేశారు.
అయినప్పటికీ.. అధికార పార్టీ హవా కొనసాగింది. దీంతో మొత్తం 65 డివిజన్లకు గాను టీడీపీ కేవలం 14 స్థానాల్లోనే విజయం దక్కించుకుంది. దీంతో ఇక, టీడీపీ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, వైసీపీ భారీ సంఖ్యలో నేతలను గెలిపించుకున్నా.. వ్యవస్థీకృతంగా ఉన్న లోపాలు మాత్రం పార్టీని, నేతలను పట్టిపీడిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా అంశాలను తమకు అనుకూలంగా మార్చుకున్న టీడీపీ సంఖ్యాబలం తక్కువగానే ఉన్నప్పటికీ.. అధికార పార్టీని కౌన్సిల్‌లో ఎండగట్టాలని నిర్ణయించుకుంది.
ఇక, వైసీపీ తరఫున గెలిచిన వారిలో ఎక్కువ మంది రాజకీయాలకు కొత్త. పైగా కేవలం పదోతరగతితోనే ఆపేసిన మహిళలు ఉన్నారు. దీంతో వారికి కౌన్సిల్ వ్యవహారాలు.. రాజకీయం పెద్దగా వంటబట్టలేదు. ఇక, టీడీపీ తరఫున గెలిచిన వారిలో సీనియర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో కౌన్సిల్‌లో వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు పన్నుల పెంపు, చెత్తపై పన్ను.. సహా.. ఇతరత్రా అంశాలతో రెడీ అవుతున్నారు.
కరోనా నేపథ్యంలో వాయిదా పడిన కౌన్సిల్ త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. దీంతో తమ సత్తా చాటేందుకు టీడీపీ నేతలు రెడీ కావడం.. నేరుగా చంద్రబాబే నేతలను దిశానిర్దేశం చేస్తుండడం వంటివి బెజవాడ కార్పొరేషన్‌లో టీడీపీ పుంజుకునేందుకు అవకాశం ఏర్పడుతోందని అంటున్నారు పరిశీలకులు.