నలభై ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపు కనుమరుగయ్యే స్థితికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక పార్టీ దాదాపు మూతపడే స్థాయికి వచ్చేసింది. అధినేత చంద్రబాబు పూర్తిగా ఏపీకే పరిమితం కావడంతో…తెలంగాణ టీడీపీకి సరైన నాయకుడు దొరక్కపోవడంతో…ఆ పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది. ఇప్పటికే అందరూ నాయకులు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన నలుగురైదుగురు నాయకులు కూడా టీడీపీని వీడటం ఖాయమైపోయిందని తెలుస్తోంది.
పార్టీలో ఉంటే రాజకీయ జీవితం కూడా క్లోజ్ అవుద్ది కాబట్టి, ఉన్న నాయకులు కూడా తట్టా బుట్టా సర్దుకునే పనిలో పడ్డారట. ఇటీవలే ఆ పార్టీకి అధ్యక్షుడుగా చేసిన ఎల్. రమణ టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఉన్న ఒక్క ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సైతం టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అయితే పేరుకు పార్టీని ఉంచాలని చెప్పి చంద్రబాబు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుగా బక్కని నరసింహులుని పెట్టారు. ఆయనకు వయసు మీద పడింది…దీంతో ఆయన పేరుకు అధ్యక్షుడుగా ఉన్నారు తప్పితే…యాక్టివ్ గా పనిచేయడం లేదు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడం గానీ, కార్యకర్తలని కలుపుకుని పోతూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు గానీ చేయడం లేదు. దీంతో తెలంగాణలో పార్టీ పుంజుకోవడం జరిగే పని కాదని అర్ధమైపోతుంది. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న ఒకరిద్దరు కీలక నేతలు సైతం పార్టీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్న కొత్తకోట దయాకర్ రెడ్డి, ఆయన భార్య సీత దయాకర్ రెడ్డిలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారట. ఎలాగో రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారు… అటు వెళ్లనున్నారు. ఇక మరో కీలక నేత అరవింద్ కుమార్ గౌడ్ సైతం టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారని తెలిసింది. మొత్తానికైతే తెలంగాణలో టీడీపీ దుకాణం క్లోజ్ చేసే రోజు దగ్గరకొచ్చిందనే చెప్పాలి.